కాంగ్రెస్ పార్టీలో  చాలా గ‌బ్బిలాలు ఉన్నాయి కానీ గాంధీ భ‌వ‌న్ గ‌బ్బిలాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. అవి ఎవ్వ‌రినీ ప‌నిచేయ‌నీయ‌వు అవి కూడా ప‌నిచేయ‌వు. వేళ‌కు ఇంత తిని మ‌రింత ప‌డుకుని కుదిరితే క‌ప్పు కాఫీ తాగొచ్చాక మీడియాతో ముచ్చ‌ట్లాడి ఇంటికిపోతాయి. గ‌త కొన్నేళ్లుగా ఈ గ‌బ్బిలాలు తెల్ల చొక్కా న‌ల‌గ‌కుండా, మూడు రంగుల కండువా న‌ల‌గ‌కుండా చేస్తున్న ప‌ని ఇదే! మ‌ధ్య‌లో కొంత‌లో కొంత రాజ‌శేఖ‌ర్ రెడ్డి మార్చ‌గ‌లిగాడే కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆ మార్పు ప్ర‌భావం అన్న‌ది ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అప్ప‌ట్లో ఆయ‌నను చాలా మంది సీనియ‌ర్లు అడ్డుకునేవారు. మీడియా ముఖంగా కూడా క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పి మాట్లాడేవారు. త‌రువాత కాలంలోనూ అదేవిధంగా వాళ్లు ఉన్నార‌నుకోండి. న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రాజ్యంలోనూ అటుపై ఇంకొంద‌రి రాజ్యంలోనూ వారేమీ బాగుప‌డిందేమీ లేదు.

బొత్స లాంటి లీడ‌ర్లు కూడా పీసీసీని మార్చ‌లేక‌పోయారు. తాజాగా సోనియా అనే ఓ రాజ‌మాత త‌న ప‌రిధిలో రేవంత్ రెడ్డి బాగా ప‌నిచేస్తార‌ని తీసుకున్నారు. కానీ ఇదే ఇప్పుడొక పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. రేవంత్ డీఎన్ ఏ అంతా టీడీపీదే క‌నుక ఇక్క‌డ ఆయ‌న రాణించాల‌నుకోవ‌డం, రాణించినా నిలదొక్కుకోవాల‌నుకోవ‌డం అన్న‌వి జ‌ర‌గ‌ని ప‌ని. అలాంట‌ప్పుడు రేవంత్ ను ఎందుకు తీసుకున్నార‌న్న సందేహం రావొచ్చు.

ఎందుకు తీసుకున్నారంటే పార్టీ కోసం కాస్త‌యినా ప‌రుగులు పెట్టే నేత ఉంటే బాగుంటుంద‌ని, ఆర్థో ఫిట్ ఆయిల్ ను మోకాళ్ల‌కు  రాసుకునే బ్యాచ్ నుంచి ఎవ్వ‌రిన‌యినా తీసుకుంటే మ‌ళ్లీ ముంద‌రిలానే పార్టీ భ్ర‌ష్టు ప‌ట్టిపోతుంద‌న్న భావ‌న ఆమెది. ఆమె భావ‌న బాగుంది కానీ ఆమె ఎంపికే బాగాలేదు అన్న వాద‌న ఒక‌టి ఏనాటి నుంచో విన‌వ‌స్తున్న‌ది. ఈ త‌రుణంలో కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీకి చెందిన గ‌బ్బిలాల‌నూ పిల్ల‌కాకి అయినా రేవంత్ ఏ విధంగా దారికి తీసుకువ‌స్తాడు అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: