పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నోట బాబోరి రేవంత్‌ మాట వచ్చింది. పంజాబ్‌కు చెందిన ఆయన తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గురించి మాట్లాడటం ఏమిటి? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. ఈ విషయం తెలుసుకోవాలంటే ముందుగా అమరీందర్‌ ఏ సందర్భంలో రేవంత్‌ గురించి మాట్లాడారు? తెలుసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత రేవంత్‌ గురించి అమరీందర్‌ సింగ్‌ అసలు ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? అనేది తెలుసుకుందాం.

పంజాబ్ సీఎం పదవి నుంచి తప్పించడంతో తీవ్రమనస్తాపం చెందిన కెప్టెన్ అమరీందర్.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. హస్తం పార్టీతో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తనకు ఉన్న అనుబంధంతో అమరీందర్‌సింగ్‌ తెగదెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇప్పటికే లేఖ కూడా పంపారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణను ఆయన వెల్లడించారు. పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పేరిట కొత్త పార్టీ పెడుతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. దీంతో రానున్న సంవత్సరం పంజాబ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీ ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇక కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై మళ్లీ విమర్శలు గుప్పించారు. తనను సీఎం పదవి నుంచి తప్పించడానికి కుట్ర చేశారని సోనియా సహా రాహుల్‌, ప్రియాంక గాంధీలపై ఆయన ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి కృషి చేసిన తన పట్ల వారు వ్యవహరించిన శైలి చాలా బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవం లేని చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రి చేయడం సరికాదని అమరీందర్‌ ఆక్షేపించారు.

ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి గురించి అమరీందర్‌సింగ్‌ తన లేఖలో ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన రేవంత్‌రెడ్డికి తెలంగాణలో.. అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన సిద్దూను పంజాబ్‌ పీసీసీ అధ్యక్షులుగా చేయడం ఏమిటని పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఆయన ప్రశ్నించారు. ఇక పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పేరిట కొత్త పార్టీ  ఏర్పాటుచేస్తున్న అమరీందర్.. గతంలోనే భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో అమరీందర్‌ సింగ్‌ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: