భారత్ పై పాకిస్తాన్ మళ్లీ ఆంక్షలు విధించింది. విమాన ప్రయాణాలకోసం తమ ప్రాంతాన్ని వాడుకోవడానికి వీల్లేదని చెప్పింది. అయితే కేవలం శ్రీనగర్ నుంచి వెళ్లే విమానాలపై మాత్రమే ఈ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. భారత్ నుంచి అమెరికా, యూకే వెళ్లే విమానాలపై ఆంక్షలు లేవని చెప్పింది. శ్రీనగర్-షార్జా వాయు మార్గంపై మాత్రమే ఈ నిషేధం ఉంటుందని తెలిపింది. దీంతో గగనతలాన్ని వాడుకునే విషయంలో పాక్ నిబంధనలు సడలించాలని కోరింది భారత్.

పాక్ కి ఇదేమీ కొత్త కాదు..
పుల్వామా దాడుల అనంతరం.. బాలాకోట్ లో భారత్ ప్రతీకారం తీర్చుకున్న తర్వాత పాకిస్తాన్ ఆకాశ మార్గంపై ఆంక్షలు విధించింది. భారత విమానాలు తమ ఆకాశ భాగంలో ఎగరకూడదని నిబంధనలు పెట్టింది. 2019 ఫిబ్రవరిలో ఇండియా ఫ్లైట్స్ కి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది పాకిస్తాన్. ఆ తర్వాత ఆంక్షలు సడలించడంతో భారత విమానాలు పాక్ ఆకాశ భాగం ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నాయి. 2009లో శ్రీనగర్ నుంచి దుబాయ్ వెళ్లే ఫ్లైట్ ప్రయాణంపై కూడా ఇలాగే ఆంక్షలు విధించింది పాక్. ఇప్పుడు మరోసారి తన అక్కసు ఇలా వెళ్లగక్కింది. అక్టోబర్ 23న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. శ్రీనగర్ - షార్జా విమాన సర్వీసులను ప్రారంభించారు. అయితే రోజుల వ్యవధిలోనే దీనిపై నిషేధం విధించింది పాకిస్తాన్, కారణం చెప్పడానికి నిరాకరించింది. అక్టోబర్ 31న సడన్ గా గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ విమానం తన దారి మళ్లించుకోవాల్సి వచ్చింది.

జమ్ము కాశ్మీర్ ని తమ అంతర్భాగంగా చెప్పుకునే పాకిస్తాన్ కు.. శ్రీనగర్ తో ఇతర దేశాలకు ప్రయాణ సౌకర్యాలు పెంచితే కంటగింపు. అందుకే శ్రీనగర్ నుంచి విదేశాలకు వెళ్లే విమానాలకు తమ వాయు మార్గంలో అనుమతి ఇవ్వలేమంటూ ఆంక్షలు పెట్టింది. పాకిస్తాన్ నిర్ణయంతో శ్రీనగర్ నుంచి షార్జా ప్రయాణం అరగంట పెరిగింది. ప్రయాణ టికెట్ రేటు కూడా భారీగా పెరిగింది. దీంతో భారత్ అధికారులు పాకిస్తాన్ కు ఓ అభ్యర్థన పంపించారు. ఇప్పటికే చాలామంది ప్రజలు ఈ మార్గం ద్వారా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారని, వారిపై అదనపు భారం మోపడం సరికాదని, పాక్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. అయితే ఇప్పటి వరకు పాక్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: