విజయవాడ పేరు చెబితే చాలు... అందరికీ మండే ఎండలు, ఇరుకు రోడ్లు... ట్రాఫిక్ కష్టాలు... ఇవే గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం జనాభా పెరగడంతో ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే రోడ్ల విస్తరణ ఒకటే మార్గమని అంతా భావించారు. కానీ విజయవాడ పరిస్థితులకు రోడ్ల విస్తరణ సాధ్యం కాలేదు. ఇదే సమయంలో విజయవాడ నగరం మధ్యలో నుంచే చెన్నై - కోల్‌కతా 16వ నంబరు జాతీయ రహదారి వెళ్తుంది. దీంతో పెద్ద పెద్ద వాహనాల రాకపోకలతో మరింత ఇబ్బందిగా మారింది ట్రాఫిక్. దీనికీ ఒకటే పరిష్కారమని గత ప్రభుత్వం భావించింది. బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడాలంటే.. ఫ్లై ఓవర్‌ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. దీనికి 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ... కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. రెండు వైపులా రెండు వేరు వేరు ఫ్లై ఓవర్లను నిర్మించాలనేది ప్రభుత్వం ప్లానింగ్. అనుకున్నట్లుగానే ముందుగా కోల్‌కతా - చెన్నై వైపు ఫ్లై ఓవర్ ప్రారంభించారు.

మొదటి ఫ్లై ఓవర్ గతేడాది ప్రారంభమైంది. రెండో వైపు ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా సరిగ్గా ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. రెండేళ్లలో ఇది పూర్తి కావాల్సి ఉంది. కానీ కాంట్రాక్ట్ సంస్థ మాత్రం దీనిని రికార్డు సమయంలోనే పూర్తి చేసింది. ఒప్పంద కాలానికి ఆరు నెలలు ముందే ఇది పూర్తైంది. ఏకంగా 2 కిలోమీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు అధికారులు. దీని ద్వారా జాతీయ రహదారిపై గుంటూరు వైపు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. బెంజ్ సర్కిల్ వద్ద ఆగాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. స్క్రూ బ్రిడ్జి దగ్గర నుంచి నోవాటెల్ హోటల్ వరకు ఈ ప్రయాణం సాగుతుంది. అటు బెంజ్ సర్కిల్ మీదుగా, రమేష్ ఆసుపత్రి మీదుగా రాకపోకలు సాగించే నగర వాసులు కూడా ఇకపై సిగ్నల్స్ వద్ద గంటలు గంటలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు కూడా. రామవరప్పాడు వద్ద కూడా ఓ ఫ్లై ఓవర్ నిర్మించాలని బెజవాడ వాసులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: