పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, నకిలీ కరెన్సీ మాయమవుతుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలతో.. తమ జీవితాలు బాగుపడ్తాయని మధ్య తరగతి ప్రజానీకం విశ్వసించింది. అందుకే నోట్ల మార్పిడిలో అనేక ప్రయాసలను ప్రజలు ఎదుర్కొన్నారు. ప్రతిరోజూ బ్యాంకుల ముందు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడ్డారు. తమ డబ్బు తీసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఈ ప్రహసనంలో క్యూలైన్లలో నిలబడ్డ వారిలో దాదాపు వంద మందికి పైగా మరణించారు. కేవలం 50 రోజుల్లో సమస్యలు అన్నీ తొలగిపోతాయని, లేకపోతే తనకు ఏ శిక్ష విధించినా భరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ నమ్మబలికిన మాటలను కూడా ప్రజలు పూర్తిగా విశ్వసించారు. కొత్తగా ముద్రించిన నోట్లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ కొన్ని మాసాల పాటు కరెన్సీ కష్టాలు మాత్రం తొలగలేదు.

నోట్ల రద్దు తర్వాత కూడా బ్యాంకులు, ఏటీఎంల ముందు నెలల తరబడి ప్రజలు బారులు తీరి నిల్చొన్నారు. లక్షలాది మంది ప్రజలకు కొత్త నోట్లు సకాలంలో అందలేదు. దీంతో కొన్ని చోట్ల పెళ్లిళ్లు నిలిచిపోయాయి. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతపడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బ తిన్నాయి. నగదు లభ్యత చాలా కష్టమైంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా తమిళనాడులోని తిరుపూర్‌లోనే 50 వేలకు పైగా చిన్న తరహా పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ లెక్కన దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల పరిశ్రమలు మూత పడ్డాయో అర్థమవుతుంది. 95 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగే దేశంలో... ఒక్కసారిగా నోట్ల రద్దు కారణంగానే ఇలాంటి తీవ్ర పరిణామాలు తలెత్తాయని, ఇందులో ఆశ్చర్యమేమీ లేదని ప్రధాని మోదీ మద్దతుదారులు అయిన ఆర్ధిక వేత్తలు, నిపుణులు నిదానంగా సెలవు ఇచ్చారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా మందగించడమే కాకుండా.. నిరుద్యోగం సైతం తీవ్రంగా పెరిగింది. దీని ఎఫెక్ట్ జీడీపీపై కూడా తీవ్రస్థాయిలోనే పడింది. ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయం, ఉత్పత్తి, నిర్మాణం వంటి కీలక రంగాలు కుదేలయ్యాయి. దీంతో అసంఘటిత రంగంలోనూ లక్షలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల డిజిటల్ లావాదేవీలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత జీఎస్‌టీ అమలు, కరోనా పరిణామాలు వంటివి ఆర్థిక వ్యవస్థపై ఇంకా ఎక్కువగా దుష్పరిణామాలు చూపాయి. అయితే ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోదీ విజయం సాధించారు. అందుకే పెద్ద నోట్ల రద్దు కారణంగా పడిన కష్టాలను, జరిగిన నష్టాలను అందరూ మరిచిపోయారు. మొత్తంమీద పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో కుదేలు అయిన దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటానికి మరింత సమయం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: