ఆఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి... తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు. అయితే అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తైనా కూడా... ఇప్పటికీ అంతర్జాతీయ గుర్తింపు మాత్రం రాలేదు. ఇందుకోసం తాలిబన్లు తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు కూడా తాలిబన్ ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. మొదటి నుంచి తమకు మద్దతుగా ఉన్న పాకిస్తాన్ ప్రస్తుతం చేతులు ఎత్తేసింది. ఇదే సమయంలో ఆఫ్ఘానిస్థాన్‌లో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది భారత్. వీటిని పరిరక్షించుకునేందుకు కూడా మోదీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫ్ఘాన్లకు ఆపన్న హస్తం అందించింది. ఏకంగా 54 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను ఆఫ్ఘాన్లకు అందించేందుకు ముందుకు వచ్చింది భారత్. తాలిబాన్ల పాలన నేపథ్యంలో ఆ దేశంలో ఉగ్రవాదుల పెత్తనం లేకుండా చూసేందుకు కూడా భారత ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

ఆఫ్ఘానిస్థాన్‌పై పాకిస్తాన్, చైనా ప్రభావం తగ్గేలా... భారతదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆఫ్ఘాన్ పొరుగు దేశాలతో పాటు రష్యా, ఇరాన్ వంటి దేశాలతో కలిపి జాతీయ భద్రాత సలహాదారుల సమావేశం నిర్వహిస్తోంది ఇండియా. ఈ సమావేశానికి భారత్ ఆతిధ్యమిస్తోంది. రష్యా, ఇరాన్‌తో పాటు, ఆసియాలోని పలు కీలక దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయా దేశాలకు ఆహ్వానాలు పంపింది భారత విదేశాంగ శాఖ. అయితే భారత్ ఆతిధ్యమిస్తున్న ఈ సమావేశానికి హాజరు కావడం లేదని పాకిస్తాన్, చైనా దేశాలు తేల్చి చెప్పాయి. ఈ విషయాన్ని ఆయా దేశాలు లేఖల ద్వారా వెల్లడించాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఢిల్లీలో జరిగే ఎన్ఎస్ఏల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న భద్రతా సవాళ్లను ఎదుర్కొవడం, ఆఫ్ఘానిస్థాన్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, సరిహద్దు వివాదాలపై తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: