74 రోజులపాటు జైలు జీవితం గ‌డిపిన తీన్మార్ మ‌ల్లన్న విడుద‌ల‌య్యారు. సోమ‌వారం హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చారు. జైలు వెలుప‌ల అనుచ‌రులు, అభిమానులు మ‌ల్ల‌న్న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వారి కోలాహ‌లం మ‌ధ్య ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. జైలు నుంచి విడుద‌ల‌యిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు తీన్మార్ మ‌ల్ల‌న్న. ప్ర‌శ్నించే గొంతుక‌ను నొక్కే భాగంలోనే త‌న‌ను అరెస్ట్ చేశార‌ని ఆరోపించారు. అలాగే 74 రోజుల పాటు కావాల‌నే అక్ర‌మ కేసులు బ‌నాయించి జైలు పాలు చేశార‌ని అన్నారు. సీఎం కేసీఆర్ ఆయ‌న కొడుకు కేటీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచ‌కం సృష్టించాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు.


 తాను ఎలాంటి త‌ప్పు చేయాలేన‌ని అందుకే భ‌య‌ప‌డ‌డం లేద‌ని, భ‌విష్య‌త్తులో ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు. అయితే, ఈ క్ర‌మంలో తీన్మార్ మ‌ల్ల‌న్న గ‌తంలో కొన‌సాగించిన విధంగానే దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తారా అనే చ‌ర్చ కొన‌సాగుతోంది. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏ విధంగా ఉంటుంద‌ని తెలంగాణ రాజ‌కీయా వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింద‌ని చెప్పొచ్చు. కేసీఆర్‌ను తీవ్రంగా వ్య‌తిరేకంగా మాట్లాడే మ‌ల్ల‌న్న‌కు సొంత‌గా రాజ‌కీయ ల‌క్ష్యాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయ‌న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రెండో స్థానంలో రావ‌డంతోనే ఆయ‌న‌కు యువ‌త‌లో ప్ర‌త్యేక‌మైన అభిమానం ఉంద‌ని వెల్ల‌డ‌యింది.


  అరెస్టు చేయడానికి ముందే పాద‌యాత్ర‌కు ప్లాన్ చేశారు మ‌ల్ల‌న్న‌. జైల్లో ఉన్న సంద‌ర్భంలో బ‌య‌ట‌కు రావ‌డానికో లేదా ఇత‌ర కార‌ణంతో తెలియ‌దు కానీ బీజేపీలో చేరుతాన‌ని సంకేతాలిచ్చారు. స్వ‌యంగా ఆమె స‌తీమ‌ణి మాత‌మ్మ అమిత్ షా తో భేటీ అయ్యారు. అలాగే మ‌ల్ల‌న్న కేంద్రానికి లేఖ కూడా రాశారు. అయితే, ఇప్పుడు మ‌ల్లన్న బీజేపీలో చేరే అంశం పై స్ప‌ష్టత లేదు. ఇప్పుడే విడుద‌ల‌యిన సంద‌ర్భంగా కొన్ని రోజులు ఆగి నిర్ణ‌యం తీసుకుంటారా అనేది చూడాలి. గ‌తంలో ఉన్న‌విధంగా ఉంటే మ‌ళ్లీ అరెస్ట్ చేస్తారని అది త‌న భ‌విష్య‌త్తుకు ఇబ్బందిగా మారుతుంద‌ని మ‌ల్ల‌న్న భావిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి మ‌ల్ల‌న్న ఎలా ముందుకు సాగుతార‌నేది వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: