హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన ఘోర ఫలితాలతో ఆ పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వచ్చిన కాంగ్రెస్ పరిస్థితుల్లో మార్పు రాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే హుజరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం కాంగ్రెస్ పై ఉండదని రేవంత్ అండ్ టీం చెబుతున్నప్పటికీ, ఈ ఉప ఎన్నిక కారణంగా కాంగ్రెస్ లోకి వలస వచ్చే నేతలు కచ్చితంగా డైనమా లో పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హుజరాబాద్ ఓటమిని ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావాలని పార్టీ హైకమాండ్  ఆదేశించింది. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఓటమి పై సమీక్ష జరపనుంది. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు, సీఎల్పీ లీడర్, ఏఐసీసీ కార్యదర్శి హాజరు కావాలని పార్టీ అధిష్టానం తెలిపింది. హుజరాబాద్ లో ఓటమి కి గల కారణాలపై హైకమాండ్ చర్చించనుంది. ముఖ్యంగా హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం దారుణంగా పడిపోవడం పై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కొందరు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పడిపోవడం పై కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఓటమిపై సమీక్ష జరపాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి నుంచి వెనకబడిన సంగతి తెలిసిందే. అభ్యర్థి ఖరారు విషయంలో చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిని అవలంబించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు మినహా ఇతర ముఖ్యనేతలు అటువైపు చూడలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ కు కేవలం 3014 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర చర్చకు దారితీశాయి. ఓటమికి పూర్తి బాధ్యత తానే అని రేవంత్ రెడ్డి  ప్రకటించారు. అయితే హుజురాబాద్ ఓటమి పై కాంగ్రెస్పార్టీలోని కొందరు సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసమే కాంగ్రెస్ ఇలా చేసిందనే ఆరోపణలు వినిపించాయి. ఇక ఢిల్లీ పెద్దలు సమీక్ష తర్వాత పార్టీలో మార్పులు చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: