పెట్రోల్, డీజిల్ పై హద్దు పద్దు లేకుండా పన్నులు బాది ధరాఘాతాన్ని మూటగట్టుకున్న మోడీ ప్రభుత్వం, ఇప్పుడు పిసరంత ఎక్సైజ్ సుంకం తగ్గించి, అక్కడికేదో ప్రజలకు ఒరగబెట్టినట్లు పోజు పెడుతోంది. అంతేనా, మేం పన్నులు తగ్గించాం, రాష్ట్రాలకు మీ పన్నులు తగ్గించాలని ధర్మ సందేశం ఇచ్చింది. కేంద్రంలో ఏడేళ్ల బీజేపీ పాలనలో వడ్డించిన పెట్రో పన్నులతో పోలిస్తే లీటర్ డీజిల్ పై 10 రూ. లీటర్ పెట్రోల్ పై 5 రూ. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొండను లాగి ఇసుక రేణువును వదిలేసిన చందం. ఇంధన ధరల తో ప్రతి రోజూ అన్ని వస్తువుల ధరలు దీపావళి టపాసుల మాదిరి పేలుతుండగా, ప్రస్తుత సుంకం స్వల్ప తగ్గింపును ప్రజలకు దీపావళి కానుకగా బిజెపి అభివర్ణించడం నయవంచన.

బిజెపి వచ్చాక ఇంధన ధరలపై కేంద్ర పన్నులు ఏ స్థాయిలో పెరిగాయో సింహావలోకనం చేసుకుంటే దిమ్మతిరుగుతుంది. 2014లో లీటరు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం 10రూ. కాగా,ఇప్పుడు రూ. 33, డీజిల్ పై  రూ. 5 కాస్త రూ. 32 అయింది. పెట్రో ఉత్పత్తుల విక్రయం పై పన్నుల ద్వారా కేంద్రానికి 2014లో 75 వేల కోట్ల ఆదాయం రాగా 2021లో 3.60 లక్షల కోట్లు. 2014లో మల్లె కేంద్ర పన్నులు ఉంటే లీటర్ పెట్రోల్ పై 66 లీటర్ డీజిల్ పై 55 కు ప్రజలు పొందవచ్చు. తన పన్నుల నిర్వాకాన్ని కావాలనే బిజెపి సర్కారు దాచిపెడుతుంది . ఇప్పుడు తీరిగ్గా రవ్వంత సుంకం తగ్గించడం సైతం రాజకీయమే. మొన్న కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఉత్తరప్రదేశ్,హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తుండడంతో పరాజయం పాలవుతోందన్న భయంతో స్వల్పంగా తగ్గించిందన్నది అసలు రహస్యం. కొన్ని బిజెపి రాష్ట్రాల్లో స్వల్పంగా వ్యాట్ ను తగ్గింపజేసి, ఇదే అదనుగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తగ్గించాలని రాజకీయం ఆడుతోంది. బిజెపి వాదనపై కేరళ వామపక్ష ప్రభుత్వం ధీటుగానే స్పందించింది. తాము ఆరేళ్లలో అదనంగా పన్నులేమీ వేయలేదని , ఒకసారి తగ్గించామని, కేంద్రం బేసిక్ ప్రైజ్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో, స్టేట్ టాక్స్ తో కలుపుకొని మొత్తంగా డీజిల్ ధర  12.30, పెట్రోల్ ధర 6.56 తగ్గుతుందని వివరించింది. తమిళనాడు సైతం ఇప్పటికే పెట్రోల్ ధర తగ్గించామని, ఇంకా వ్యాట్ తగ్గించను పొమ్మంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్ర వ్యవహారాన్ని తప్పుబడుతూనే తాము తగ్గించలేం పొమ్మన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించి ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం కలిగించవలసిన బాధ్యత అటు వైసీపీ సర్కార్ పైనా, ఇటు టిఆర్ఎస్ సర్కార్ పైన ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: