ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కనీసం జీతాలకు, పెన్షన్లకు కూడా డబ్బులు లేని దుస్థితి. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఎవరు అప్పు ఇస్తారా... అని ఆర్థిక శాఖ అధికారులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన్న రాజేంద్ర నాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రుణాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటకే ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేశారు. వాటి ద్వారా వచ్చిన డబ్బులను కూడా ప్రభుత్వం వాడేస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు పేరుతో నిధులను విపరీతంగా వెచ్చించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉపాధి హామీ పనులు చేసిన వారికి కూడా బిల్లులు చెల్లించలేదు. ఇక కాంట్రాక్టర్లు అయితే బిల్లులు చెల్లించండి మహా ప్రభో అంటూ విజయవాడ ధర్నా చౌక్‌లో భిక్షాటన కూడా చేశారు. కొత్త పనుల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే... కనీసం ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు. పాత బిల్లులకే దిక్కు లేదు... కొత్త పనులు ఎలా చేయాలని అధికారులను నిలదీస్తున్నారు కూడా.

ఓ వైపు రాష్ట్రంలో రహదారులన్నీ భయంకరంగా మారిపోయాయి. ఏ రోడ్డు చూసినా కూడా గోతుల మయమే. వీటిని రిపేరు చేసేందుకు ఆర్థిక శాఖ టెండర్లు పిలిస్తే.. ముందుకు వచ్చే కాంట్రాక్టరు కరువయ్యాడు. రహదారుల మరమ్మతులకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని సాక్షాత్తు సీఎం ఆదేశించినా కూడా... పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర రహదారి నిధి కింద సెప్టెంబర్ నెలలో 250 కోట్ల రూపాయల పనులు చేశారు కాంట్రాక్టర్లు. ఆ బిల్లులు రాకపోవడంతో... కొత్త పనులు చేసేది లేదని తేల్చి చెప్పేశారు. వీటికి తోడు ఇప్పుడు అంగన్‌వాడీలకు కోడి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలకు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. దాదాపు 4 నెలలుగా బిల్లులు నిలిచిపోవడంతో... గుడ్లను సక్రమంగా సరఫరా చేయలని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సరఫరా నిలిచిపోయింది కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: