తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైందనీ.. బీజేపీ నేతలు అడ్డుపడ్డా ఇది ఆగదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 6వేల 600 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. అవసరమైతే మరిన్ని తెరుస్తామన్నారు. బీజేపీ నేతలకు రైతులపై ప్రేమ ఉంటే ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ధర్నాలు ఇక్కడ కాదు.. ఢిల్లీలో చేయాలని సూచించారు. తాము వడ్లు కొంటున్నామనీ.. బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6వేల 663 కేంద్రాలను ఏర్పాటు చేసి.. వానాకాలం పండిన ప్రతీ గింజను కొంటామని చెప్పారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.

కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం కొనాగిస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగణంగానే నియోజకవర్గాల్లో  రేపటి నుంచి ఆందోళనలు చేయనున్నట్టు చెప్పారు. తాము రైతుల పక్షాల పోరాటం చేస్తున్నామన్నారు. పోరాడే రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. రైతులకు న్యాయం చేయలేమా అని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఫుట్ బాల్ ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. యాసంగిలో వరి వేయొద్దని సీఎం అనడం ఆశ్చర్యం కలిగించిందనీ.. వరి ఎలా కొనుగోలు చేయాలో ప్రణాళికలు వేయడమే ప్రభుత్వం పని అని పేర్కొన్నారు. రైతులు పండించిన పంట కొనను అనడం సరికాదనీ.. వారిని నాశనం చేయడానికి కేసీఆర్, బండి సంజయ్ ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని భట్టి విమర్శించారు. మొత్తానికి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధానికి సిద్దమవుతోంది. రైతులకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.









మరింత సమాచారం తెలుసుకోండి: