ప్రస్తుతానికి తెలంగాణ టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతల్లో డి.శ్రీనివాస్ పేరొక్కటే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ లో అవమానం పొందిన మాజీ మంత్రులు టి.రాజయ్య, లక్ష్మారెడ్డి వంటి వారు కూడా కేసీఆర్ పై రగిలిపోతున్నారు కానీ బయటపడటంలేదు. పాత కక్షలు పక్కనపెడితే.. రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత చాలామంది మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్నారు. కానీ వారిలో సగానికి సగం మంది నిరాశలోనే ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈటలే మార్గదర్శి అయ్యే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ లో ఉండాలంటే కచ్చితంగా కేసీఆర్ కి జై కొట్టాల్సిందే. కాదనేవారెవరూ లేరు. అయితే అదే సమయంలో కేటీఆర్ పెత్తనాన్ని కూడా సహించాలంటే కొంతమంది సీనియర్లకు మనసొప్పడంలేదు. ఆఖరికి హరీష్ రావుకి కూడా టీఆర్ఎస్ పై పెత్తనం లేదు. ఉద్యమ సమయంలో ముందుండి నడిపించిన వారంతా ఇప్పుడు బాగా వెనకబడ్డారు. దీంతో వారందరికీ ఈటల గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్నాళ్లీ అవమానాలు..
ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగూ పదవులు దొరకలేదు, ప్రత్యేక రాష్ట్రం వచ్చాకయినా పదవులపై ఆశ పెట్టుకుంటే, టీఆర్ఎస్ కొంతమందికే అవకాశమిచ్చింది. మిగతా వాళ్లు కేసీఆర్ పై లోలోపల రగిలిపోతున్నారు. అలాంటి వారంతా తప్పనిసరై పార్టీలో ఉన్నారు. వచ్చే దఫా టికెట్ వస్తుందో లేదో కూడా తెలియదు. మరోవైపు కాంగ్రెస్ నుంచి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డికి, టీడీపీ నుంచి వచ్చి చేరిన ఎల్.రమణకు కూడా ఎమ్మెల్సీలు ఖరారవుతున్నాయి. దీంతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు మథనపడుతున్నారు. కానీ టీఆర్ఎస్ వీడి వచ్చేందుకు, కేసీఆర్ తో కయ్యం పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. వీరందరికీ ఈటల వ్యవహారంతో కాస్త ధైర్యం వచ్చింది. అయితే బీజేపీపై మరీ అంత గుడ్డి నమ్మకం కూడా వీరికి లేదు. అయితే ఈటలతో విడతలవారీగా సమావేశాలు పెట్టి టీఆర్ఎస్ నుంచి వలసలు ప్రోత్సహించేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ వేస్తోంది. ఇది ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: