ఒక్కో సంస్థకు ఒక్కో విధానం ఉంటుంది.. మరి పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు ఉన్న పనులను ఒకే కంపెనీ నిర్వహించగలుగుతుందా.. మందు అమ్మే సంస్థ.. సంక్షేమం చూస్తుందా.. ఇప్పుడు జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం చూస్తే ఈ అనుమానాలు కలుగక మానవు. అసలు విషయం  ఏంటంటే.. ఏపీలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఉంది. దీన్నే ముందుగా.. ఏపీఎస్‌బీసీఎల్‌ అంటారు. మద్యం వ్యాపార నిర్వహణ ఈ  ప్రభుత్వ కంపెనీ ప్రధానమైన బాధ్యత. చంద్రబాబు సర్కారు హయాంలో మద్యం టోకు వ్యాపారం నిర్వహించేంది. జగన్ సర్కారు వచ్చాక చిల్లర వ్యాపారం కూడా ఈ సంస్థకే అప్పగించారు.


అంత వరకూ బాగానే ఉంది. ఇప్పుడు జగన్ సర్కారు మద్యం అమ్ముతున్న ఈ కంపెనీ  సంక్షేమ పథకాల అమలు బాధ్యత అప్పగించింది. ఎందుకయ్యా అంటే.. మద్యం విక్రయాల ద్వారా లభించే ఆదాయాన్ని సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తున్నాం కాబట్టి.. ఈ సంస్థ ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని కాపాడేలా సంబంధిత సంక్షేమ పథకాల పర్యవేక్షణ చేస్తేనే బావుంటుందనేది జగన్ సర్కారు లాజిక్. అందుకే ఈ మేరకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు సెప్టెంబరు 3న ఆర్డినెన్సు ఇచ్చింది.


ఈ కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ఇకపై చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల అమలు బాధ్యత ఏపీఎస్‌బీసీఎల్‌దే. మరి ఇలా ఎందుకు చేశారంటే.. ఈ పథకాల కోసం అప్పులు తీసుకురావాల్సి వస్తుంది.. మద్యం అమ్మకాలను చూపించి అప్పులు తీసుకురావడం సులభం అవుతుందన్న వాదన కూడా ఉంది. ఈ కొత్త సవరణల ప్రకారం మద్యం విక్రయాల ద్వారా ఏపీఎస్‌బీసీఎల్‌కు వచ్చే ఆదాయం ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం రూపొందించిన పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, సామాజిక సుస్థిరత కోసం మద్యం అమ్మకం ద్వారా వచ్చే డబ్బు వాడాలి అన్నది ఈ సవరణ ఉద్దేశ్యం. సంక్షేమ పథకాల నిర్వహణ మరింత పకడ్బందీగా నిర్వహించేందుకే ఈ మార్పులు అంటూ అధికార పార్టీ సమర్థించుకుంటోంది. మరి ఈ మార్పులతో వచ్చే లాభనష్టాలు అమలులో కానీ అర్థం కావు.. చూద్దాం..ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: