రాజస్థాన్.... ఏ ముహుర్తంలో ఎన్నికలు జరిగాయో తెలియదు... ఏ ముహుర్తంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలియదు కానీ... తొలి నుంచి వరుస వివాదాలే. సీనియర్, జూనియర్ నేతల మధ్య పోరు తారాస్థాయిలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ మెంబర్ గా సచిన్ పైలెట్‌కు మంచి గుర్తింపు ఉంది. రాజస్థాన్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు కూడా పైలెట్. పార్టీ గెలిస్తే... సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి అని అంతా భావించారు కూడా. కానీ అనూహ్యంగా పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కే పట్టం కట్టింది. అప్పట్లో ఈ అంశం పెను దుమారానికి కూడా కారణమైంది. కానీ అధిష్ఠానం కలుగజేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఇక ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు నేతల మధ్య అంతగా సఖ్యత కుదరలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాజస్థాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తన వంతు కృషి చేశారు హస్తం పార్టీ పెద్దలు.

ప్రారంభం నుంచి అశోక్ గెహ్లాట్ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సచిన్ పైలెట్. కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేశారు కూడా. పదవుల కేటాయింపులో కూడా తమకు అన్యాయం జరిగినట్లు పైలెట్ వర్గం తొలి నుంచి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. రాబోయే మంత్రి వర్గ విస్తరణలో సచిన్ పైలెట్ వర్గానికి తప్పని సరిగా ప్రాధాన్యం ఇవ్వాలని సోనియా స్వయంగా ఆదేశించారు. ఇదే విషయాన్ని సోనియా స్వయంగా సచిన్ పైలెట్‌కు తెలిపారు. రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలపై సచిన్ పైలెట్‌తో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ ఏడాది జులై నెల తర్వాత సోనియాతో సచిన్ పైలెట్ సమావేశం అవ్వడం ఇదే తొలిసారి. గతంలో గెహ్లాట్‌తో వివాదం తర్వాత... తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నారు సచిన్ పైలెట్. త్వరలోనే రాజస్థాన్‌లోని గెహ్లాట్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కొన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే గెహ్లాట్ కసరత్తు చేస్తున్నారు కూడా. ఈ దఫా పైలెట్ వర్గానికి పెద్ద పీట వేయాలని సోనియా సూచించడంతో... ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లే తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: