దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా పలు ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ చట్టాల తీరుని నిరసిస్తూ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లో నిరసన చేస్తున్న రైతులను కేంద్ర మంత్రి కొడుకు చంపేశారు అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చిన నేపధ్యంలో దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్ కూడా సీరియస్ గా ఉంది. ఈ ఘటన విషయంలో పలువురు పోలీసుల మీద కూడా సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇక త్వరలోనే ఈ కేసుకి సంబంధించి సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

ఇక నేడు లఖింపూర్‌ ఖేరి హింస కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. లఖింపూర్ ఖేరీ కేసు దర్యాప్తు పై బుధవారం ఉత్తర్వులు జారీ చేయనున్నది సుప్రీంకోర్టు. కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు బయటి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం  అంగీకారం తెలిపింది. పంజాబ్,  హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్ లేదా ఇతరులను పరిగణనలోకి తీసుకున్నందున దీనికి మరో రోజు సమయం కావాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

సిట్‌లో మరికొంత మంది సీనియర్ పోలీసు అధికారులను కూడా చేర్చాలని యుపి రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కోరింది. కేసు దర్యాప్తు కోసం యుపి పోలీసుల సిట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. రేపటి లోగా యూపీలోని ఐపీఎస్ అధికారుల జాబితాను సుప్రీంకోర్టు కోరింది.  సిట్‌లోని చాలా మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు లఖింపూర్ ఖేరీ స్థాయి వారేనని సుప్రీంకోర్టు పేర్కొంది. గత విచారణ సందర్భంగా లఖింపూర్‌ ఖేరి కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు యుపి కాకుండా ఇతర రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తులు రాకేష్ కుమార్ జైన్, రంజిత్ సింగ్ పేర్లను సుప్రీంకోర్టు  సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: