తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. యాసంగి పంట వ్యవహారం ప్రస్తుతం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పెద్ద దుమారమే రేపింది. ఒక్కమాటలో బియ్యం వ్యవహారం కయ్యం రేపింది. ఇప్పటికే వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ... ప్రస్తుతం అసెంబ్లీలో కేవలం మూడు స్థానాలున్న భారతీయ జనతా పార్టీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా కేసీఆర్ మాటలు తూటాల్లా ఉంటాయి. అయితే అవి అప్పుడప్పుడు వస్తాయి. కేసీఆర్‌ను చూడాలంటే... అటు ప్రగతి భవన్ లేదా.. ఇటు ఫామ్ హౌస్‌లో మాత్రమే సాధ్యపడుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చే కేసీఆర్... ఇప్పుడు ప్రతి రోజూ కనిపిస్తున్నారు. ప్రెస్ మీట్‌లలో గంట పాటు... బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే స్వయంగా ఆందోళనలు, నిరసనలు చేయడం ఇదే మొదటిసారి కూడా.

సాధారణంగా తనదైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయగల సత్తా ఉన్న నేత కల్వకుంట్ల చంద్రశేఖర్. ఆయన బయటకు వస్తున్నారంటే... ఎవరినో టార్గెట్ చేశారనేది సొంత పార్టీ నేతల్లో కూడా ఉన్న అభిప్రాయం. ఏ ఎన్నిక జరిగినా... ఏ వ్యూహం వెనుక అయినా... ఏ నేత ఆలోచన వెనుక అయినా సరే... కేసీఆర్ మాత్రమే ఉంటారు. అది కేటీఆర్ అయినా, హరీశ్ అయినా సరే.. కేసీఆర్ చెప్పినట్లు చేయాల్సిందే. అలాంటి వ్యూహకర్తను ప్రస్తుతం కమలం పార్టీ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటే స్థానాన్ని గెలుచుకున్న కమలం పార్టీ... ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఖాతాలోని రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంది. ఇక బలమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ సీట్లు సొంతం చేసుకుంది. ఇవన్నీ కూడా కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే.. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఓ పెద్ద రాజకీయ కుదుపుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: