తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలకూ.. కేంద్రానికి ఉన్న సంబంధాలు భలే విచిత్రంగా ఉంటాయి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సంబంధాల్లో మార్పులు వస్తుంటాయి.. కొన్నాళ్ల వరకూ కేసీఆర్ టీమ్ మోడీ సర్కారుతో దోస్తీగానే ఉంది.. ఏదైనా ఎన్నికలొస్తే తప్ప రెండు పార్టీల మధ్య మాటల యుద్ధాలు తక్కువే. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత మళ్లీ రెండు పార్టీలు ఉప్పు- నిప్పు అన్నట్టు తయారయ్యాయి. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్.. ఇక తానే బీజేపీపై రోజూ యుద్ధానికి దిగుతానని వార్నింగ్ ఇచ్చారు.


అన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణలో వరి కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. బండి సంజయ్ నిన్న ఎక్కడికి వెళ్తే అక్కడ టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.. చివరకు రాళ్ల దాడి కూడా జరిగింది. ఇక కేంద్రంతో ప్రతి విషయంలోనూ టీఆర్ఎస్ వైఖరి ఘర్షణాత్మకంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో  జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలోనూ ఇదే సీన్ కనిపించింది.

 

వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో ప్రగతి భవన్‌ నుంచి ఆర్థికశాఖమంత్రి హారీష్‌రావుతో కలిసి మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులన్న కేటీఆర్‌.. రాష్ర్టాల బలమే దేశం బలమన్నారు. దేశ జీడీపికి దోహాదపడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే.. తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.


ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (1) ప్రకారం పారిశ్రామిక ప్రమోషన్ కోసం పన్ను రాయితీలు తప్పనిసరిగా అందించాల్సి ఉన్నా.. ఆ పని కేంద్రం చేయడం లేదని కేటీఆర్‌ అన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు రెండు విడతలుగా 900 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. ఇంకా చెల్లించలేదన్నారు. తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్‌లకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు పూర్తిగా అమలు కాలేదని గుర్తు చేశారు. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలలో తెలంగాణకు అవసరమైన ఎకో సిస్టమ్ ఉందన్నారు కేటీఆర్. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇంతవరకూ మంజూరు చేయలేదని కేటీఆర్ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: