ప్ర‌స్తుతం రాష్ట్రంలో  ధాన్యం కొనుగోలు పై కొట్లాట న‌డుస్తోంది. రాష్ట్రంలోకి రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయ‌కులు నిర‌స‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైప కేంద్ర ప్ర‌భుత్వ‌మే ధాన్యం కొనుగోలు చేయ‌డం లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం  తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. దీంతో రాష్ట్ర రైతులు ఎవ‌రిని న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మొద్దో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మొద‌ట్లో వ‌రి వేస్తే ఉరి అనే ప్ర‌చారాన్ని తెలంగాణ‌లోని రైతుల ద‌గ్గ‌రకు తీసుకెళ్ల‌డంలో బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహాలు ఫ‌లించాయి. 


అయితే, తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ఈ ప్ర‌చారంతో మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గ్ర‌హించిన సీఎం కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల ప్ర‌చారాల‌ను తిప్పికొట్టేందుకు తానే స్వ‌యంగా రంగంలోకి దిగాడు.  అయితే, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌ను ఆగం చేస్తున్నాయని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ రెండు ప్ర‌భుత్వాల తీరును ఎండ‌గ‌ట్ట‌డంలో కాంగ్రెస్ పార్టీ వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి. ఈ ధాన్యం కొనుగోలో కొట్లాట‌లో ఇటు టీఆర్ఎస్ మ‌రో ప‌క్క బీజేపీ నాయ‌కులు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇదే క్ర‌మంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నల్గొండ జిల్లా ప‌రిధిలో సోమ‌, మంగ‌ళ వారాల్లో ప‌ర్య‌టించనున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీలిస్తాన‌ని బండి సంజ‌య్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.


   ఈ నేప‌థ్యంలో ధాన్యం కొనుగోలు విష‌యంలో బీజేపీ, టీఆర్ఎస్‌లు  ప‌ర‌స్ప‌రం తీవ్ర మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. ప్ర‌తి గింజా కొంటామ‌న్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇప్పుడు వ‌రి పండిస్తే కొనుగోలు చేయ‌మ‌ని  చెబుతుంద‌ని బీజేపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. మ‌రోవైపు కేంద్రం కొనుగోలు చేయ‌న‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా కొనుగోలు చేస్తుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి అంత స్థోమ‌త లేద‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు.  అయితే, ఇలాంటి ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వ‌చ్చి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును ఎండ‌గ‌ట్టాల్సి ఉన్నా.. ఎందుకో త‌గిన రీతిలో స్పందించ‌డం లేద‌న వాద‌న కూడా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: