సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీస్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాన పార్టీలు ఫుల్ ఫోక‌స్ పెట్టాయి. రాజ‌కీయంగా అత్యంత కీల‌కం అయిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తో పాటు ఉత్త‌ర‌ఖాండ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. వచ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ ఐదు రాష్ట్రాల్లో త‌ప్ప‌కుండా అధికారంలోకి రావాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో యూపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు ర‌ణ‌రంగంలా మారిపోయాయి.


  403 అసెంబ్లీ సీట్లు ఉన్న  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గెలిస్తే  దాని ప్ర‌భావం 2024 ఎన్నిక‌ల‌పై ఉంటుంది. అందుకే అక్కడ అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం బీజేపీ, తిరిగి అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ పార్టీ, స‌మాజ్‌వాదీ పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. దేశంలో తిరిగి రాజ‌కీయ పూర్వ వైభ‌వం సొంతం చేసుకోవాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లే కీల‌క‌మ‌ని భావిస్తుంది. ఆ దిశగా ఆ పార్టీ   ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా యూపీలోనే మ‌కాం వేసి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీ  స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌గా పార్టీ కార్య‌కర్త‌ల‌ను ఉత్సాహ ప‌ర‌చ‌డానికి రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.


 ఈ క్ర‌మంలో యూపీ ఎన్నిక‌ల్లో ఒంటిరిగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు ప్రియాంక గాంధీ వాద్రా. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోన‌ప్ప‌టికీ అధికారంలోకి వ‌స్తామ‌నే ధిమాను వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎక్కువ సార్లు అధికారంలోకి వ‌చ్చిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అలాంటి చ‌రిత్ర‌ను మ‌ళ్లీ నిల‌బెట్టుకోవాల‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. 2017 ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ  ఆశించిన ఫ‌లితాలు రాలేదు. ఇప్పుడు సోలోగానే బ‌రిలో నిల‌వాల‌ని ప్రియాంక డిసైడ్ అయ్యారు. మ‌రి ఈ నిర్ణ‌యం ఏ మేర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: