పీకల్లోతు అప్పులు... పైగా ఆదాయం నిల్లు... దీనికి తోడు రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరలు... ఇదే ఆర్టీసీ సంస్థకు గుది బండగా మారాయి. వీటికి తోడు కరోనా వైరస్ కారణంగా దాదాపు 2 నెలల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత బస్సులు ప్రారంభమైనా కూడా ప్రయాణాలకు ప్రజలు మొగ్గు చూపడం లేదు. దీంతో ఆదాయం ఘోరంగా పడిపోయింది. చివరికి టికెట్ ధరలు పెంచాలనే ప్రతిపాదన కూడా చేసింది ఆర్టీసీ యాజమాన్యం. కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో ఆర్టీసి సంస్థను ఆదుకుంటున్న విభాగం కొరియర్. పార్శిల్ విభాగం ఇప్పుడు ఆర్టీసి సంస్థకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా కొరియర్ పార్శిల్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్టీసీని కాస్త ఆదుకుంటోంది కూడా. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కొరియర్ సర్వీసులను ఇకపై గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఆర్టీసీ సంస్థ భావిస్తోంది.

ప్రస్తుతం ప్రతి పట్టణంలో కూడా ఆర్టీసీ కొరియర్, పార్శిల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి బస్టాండ్‌లో కూడా సర్వీసు పెట్టింది ఆర్టీసీ. అదే సమయంలో తిరుపతి, రాజమండ్రి, విజయవాడతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో డోర్ డెలివరీ కూడా చేస్తోంది ఆర్టీసీ. కార్గో పార్శిల్ కోసం ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా గ్రామీణ ప్రాంతాల కోసం... గ్రామీణ ప్రాంతాల నుంచి కేజీ లోపు పార్శిల్ కవర్లను బస్టాండ్‌లకు వెళ్లకుండా... నేరుగా బస్సుల్లోనే బుక్ చేసుకునేలా ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో నేరుగా కండక్టర్ల వద్దే పార్శిల్ బుక్ చేసుకునే అవకాశం ఇస్తోంది ఆర్టీసీ. ఇందుకోసం టిమ్స్ మిషన్‌ ద్వారా టికెట్ కూడా ఇస్తారు. ఆ రశీదు నెంబర్ చెబితే చాలు... బుక్ చేసుకున్నా పార్శిల్ కవర్ ఇచ్చేస్తారు. అయితే కేజీ లోపు కవర్ మాత్రమే కండక్టర్ దగ్గర అనుమతి ఇస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా టికెట్ ధరలు కూడా ప్రకటించనున్నారు. దూరాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: