కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు తావిచ్చింది. సౌత్ జోన్ రాష్ట్రాల సమావేశం కోసం మూడు రోజులపాటు తిరుపతిలోనే ఉన్న అమిత్ షా, సైలెంట్ గా తన పని మొదలు పెట్టారు. రాష్ట్రాలమధ్య నెలకొన్న సమస్యలు తీర్చేందుకు వచ్చిన ఆయన, పనిలోపనిగా సొంత పార్టీని కూడా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి ధీటుగా.. బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి బీజేపీని తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ తమ పార్టీపై ఉన్న వ్యతిరేకతను చెరిపేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశమయిన అనంతరం, బీజేపీ ముఖ్య నేతలతోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన యాత్రకు సంబంధించిన విషయాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారట అమిత్ షా.. పాదయాత్రలో బీజేపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని క్లాస్ పీకినట్టుగా కూడా తెలుస్తోంది. వెంటనే రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలకు ఉపదేశమిచ్చారట అమిత్ షా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని.. ఇకపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా చెప్పినట్టు సమాచారం.

అయితే అమిత్ షా మాటలకు ఏపీ బీజేపీ నేతలు అవాక్కయ్యారట. ఆ పాదయాత్ర టీడీపీ చేయిస్తోందని చెప్పగా.. రైతులు పాల్గొంటున్న యాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చని.. అందులో రాజకీయాలకు ఆస్కారం లేదని అమిత్ షా గట్టిగానే చెప్పినట్టు సమాచారం. అమిత్ షా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే ముద్ర వేయించుకుంది. వ్యవసాయ చట్టాలతో ఈ అపవాదు మరింతగా పెరిగిపోయింది. అటు తెలంగాణలో కూడా రైతులకోసం బీజేపీ, టీఆర్ఎస్ కొట్టుకుంటున్నాయి. ఈ దశలో ఏపీలో కనీసం రైతుల ఉద్యమాన్ని వాడుకుంటే.. రైతులకు సపోర్ట్ గా ఉన్నారనే పేరొస్తుందని బీజేపీ నేతల ప్లాన్. ఇదీ అసలు సంగతి..

మరింత సమాచారం తెలుసుకోండి: