ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ అంటే చాలు.... అప్పుల కుప్ప అని అందరికీ తెలిసిందే. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ప్రజా రవాణా సంస్థపై కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరింది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా మరింత అప్పుల్లో కూరుకుపోయింది ఆర్టీసీ సంస్థ. అయినా సరే ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆర్టీసీ కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఆర్టీసీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడు ఇస్తున్న వేతనాలను పెంచాలనే ఏపీఆస్ ఆర్టీసీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రయాణీకుల డిమాండ్ మేరకు... తెలంగాణ రాష్ట్రానికి ఓ ప్రతిపాదన కూడా పంపింది. అంతర్ రాష్ట్ర సర్వీసులు మరిన్ని పెంచుదామని టీఎస్ ఆర్టీసీ అధికారులకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. తమకు వేతనాలు సరిపోవడం లేదని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, భద్రతా సిబ్బంది ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమ వేతనాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం వేతనాల పెంపును మూడు కేటగిరిలుగా ఆర్టీసీ యాజమాన్యం విభజించింది. నైపుణ్యం లేని కార్మికులకు 294 రూపాయలు, కొంత మేరకు మాత్రమే ఉన్న వారికి 349 రూపాయలు, నైపుణ్య కార్మీకులకు 428 రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. అలాగే డేటా ఎంట్రీ  ఆపరేటర్లకు 322 రూపాయలు, అటెండర్లకు 294 రూపాయలు, భద్రతా సిబ్బందికి 304 రూపాయలు చొప్పున వేతనం పెంచుతున్నట్లు ఆర్టీసీ నిర్ణయించింది. జీతం  పెంపు నిర్ణయం గత నెల అక్టోబర్ నుంచే అమలులో ఉంటుందన్నారు అధికారులు. కొవిడ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసులపై బ్రేక్ పడింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ... రెండు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం ఆరంభం కాలేదు. దీనితో తెలంగాణ రాష్ట్ర డిమాండ్లకు తలొగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ చివరికి వారు చెప్పినట్లుగా చేసింది. అయితే ఇప్పుడు ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరగడంతో... తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ సంస్థకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: