ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వైసీపీ ధాటికి నిలవలేకపోయింది. ఇక జనసేన కూడా చేతులెత్తేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కాస్తో కూస్తో ప్రభావం చూపిస్తుందని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గత రెండేళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలకోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు కూడా చేస్తూనే వచ్చారు. ఓ దశలో ప్రధాన ప్రతిపక్షంలా మారి.. వైసీపీ ప్రభుత్వానికి ఎదురు నిలిచారు. ఇన్ని చేసినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు జనసేనను ఆదరించలేదు. యధావిధిగా వైసీపీకే తమ ఓట్లను సమర్పించారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో జనసేన ఎక్కడా విజయం సాధించలేదు. ఒకటీ రెండు చోట్ల మినహా ఎక్కడా సీట్లను గెలవలేకపోయింది. గుంటూరు జిల్లాలోని ఓ వార్డులో జనసేన వీర మహిళ గెలుపొందింది. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు నగర పంచాయితీలో వార్డు సభ్యులుగా మరో ముగ్గురు అభ్యర్థులు గెలిచారు. ఇంతకు మించి పెద్దగా జనసేన ఆధిపత్యం ఎక్కడా చూపించలేకపోయింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ జనసేన నిరుత్సాహపరిచింది. నెల్లూరు జనసేనపార్టీలో వర్గ పోరు కారణంగా, కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.

అయితే ఈ ఎన్నికల ఓటమిపై టీడీపీ నేతలు స్పందించినా.. జనసేన పార్టీ నుంచి మాత్రం ఎటువంటి ప్రకటనా రాలేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటూ మిగిలిన నేతలెవరూ నోరు మెదపలేదు. పవన్ కళ్యాణ్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కనీసం సోషల్ మీడియా వేదికలపై కూడా ఎక్కడా ఎలాంటి ప్రెస్ నోట్ విడుదల కాలేదు. అయితే ఈ ఓటమిపై స్పందించేందుకు పవన్, ఇప్పటికే వేదికను కూడా సిద్ధం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో 21వ తేదీన పవన్ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదికగా ఆయన మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. ప్రధానంగా మత్స్యకారుల సమస్యలపై మాట్లాడాలని నిర్ణయించినప్పటికీ.. స్థానిక సంస్థల ఎన్నికలో ఓటమిపైనా ఆయన విశ్లేషించబోతున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: