రూపాయి ఖర్చు లేకుండా.. రూ. 1200 కోట్ల రూపాయలు సంపాదించడం ఎలాగో తెలుసా.. మీకు తెలియదు కానీ.. తెలంగాణ సర్కారుకు తెలుసు.. అవును.. తెలంగాణ సర్కారు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా.. ఏమీ నష్టపోకుండా.. ఏకంగా రూ. 1200 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. సర్కారుకు ఇంత ఆదాయం వస్తుందంటే.. బహుశా అది పన్నుల ద్వారా వచ్చిన సొమ్మేమో అనుకుంటారు. కానీ.. అది కాదు.. మరి ఎలాగంటే.. ఇప్పుడు తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతోంది.


ఈ మద్యం దుకాణాల కోసం తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. నిన్న ఒక్క రోజే గడువు ఉండటంతో బుధవారం 15 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయట. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తుల సంఖ్య 29 వేలకు చేరింది. అయితే.. గురువారం మరో 30 వేల దరఖాస్తులు కూడా వచ్చే అవకాశం ఉందట. విచిత్రం ఏంటంటే.. ఈ దరఖాస్తు చేసుకోవాలంటే ఫీజు ఏకంగా రూ. 2 లక్షలు ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులన్నీ కలిపి లాటరీ వేస్తారు.. ఆ లాటరీలో వచ్చిన వారికి మద్యం దుకాణాలు కేటాయిస్తారు.


అయితే.. లాటరీలో దుకాణాలు దక్కని వారికి వారు కట్టిన రెండు లక్షల రూపాయల ఫీజు తిరిగి ఇవ్వరు. అంటే.. అప్లికేషన్‌ ధర మాత్రమే రూ. 2 లక్షలు అన్నమాట. మళ్లీ దుకాణం కేటాయించిన తర్వాత దాని ఫీజులు దానివే.. దాని ఆదాయం దానిదే.. అంటే కేవలం అప్లికేషన్ల ద్వారానే ప్రభుత్వానికి రూ. 1200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజుగా తీసుకుంటున్నారు. దరఖాస్తు దారుడికి దుకాణం వచ్చినా, రాకపోయినా ఈ ఫీజు మాత్రం వెనక్కి తిరిగి ఇవ్వరన్నమాట.


అలా.. కేవలం ఫీజుల ద్వారానే ప్రభుత్వానికి కనీసం రూ.1200 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. దరఖాస్తులు వచ్చే తీరును బట్టి చివరి తేదీని పొడిగించే అవకాశం కూడా ఉందట. పెంచనీయండి.. మరో 1000 దరఖాస్తులు వచ్చినా రూ. 20 కోట్లు వచ్చినట్టేగా.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: