ఎమ్మెల్సీల ఎంపికలో  ఓరుగల్లుకు పెద్దపీట వేశారు సీఎం కేసీఆర్. మొత్తం ఆరు స్థానాల్లో ముగ్గురు జాక్ పాట్ కొట్టేసారు. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధతకు కేరాఫ్ గా నిలుస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎందరు పోటీపడిన,ఇంకెందరు ఆశలు పెట్టుకున్న అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాదు ఎమ్మెల్సీలుగా ఎంపికైన వారిలో ఇద్దరికీ మరో అద్భుత అవకాశం కూడా కల్పించబోతున్నారట. తెలంగాణ ఉద్యమానికి, కారు పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న వరంగల్, కరీంనగర్ జిల్లాలో పట్టు జారకుండా గులాబీ బాస్  జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఈ రెండు జిల్లాల కే పెద్ద పీట వేశారు.

కొద్దిరోజులుగా మారుతున్న రాజకీయా పరిణామాల నేపథ్యంలో సీఎం స్వయంగా రంగంలోకి దిగి ఈ రెండు జిల్లాల పై పట్టు కోల్పోకుండా ఉండడానికి కావలసిన ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఈ రెండు జిల్లాల ప్రజలు కెసిఆర్ ను అక్కున చేర్చుకున్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఉత్తర తెలంగాణ ప్రజలు గులాబీ దళపతి కి అండగా నిలిచారు. ప్రజల్లో ఎట్టిపరిస్థితుల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవడంతో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పట్టు కోల్పోకుండా ఉండేలా సీఎం వ్యూహరచన  చేశారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు స్థానాలకు గాను మూడింటిని ఓరుగల్లుకే కేటాయించడంతో అగ్రతాంబూలం దక్కినట్లయింది.

ఎస్సీ కోటా నుంచి కడియం శ్రీహరికి రెండోసారి అవకాశం ఇవ్వడంతో పాటు నిబద్ధతతో పార్టీకి సేవలు అందించిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు తో పాటు ఓసి కోటా నుంచి, నిరాడంబరతకు మారుపేరైన డాక్టర్ బండ ప్రకాష్ కి బీసీ కోటా నుంచి ఛాన్స్ దక్కింది.ఎమ్మెల్సీగా తీసుకున్న బండ ప్రకాష్ కు కీలక శాఖలు అప్పగిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా కడియం శ్రీహరికి కూడా మంత్రి పదవి ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే గనుక జరిగితే ఉమ్మడి జిల్లాకు నాలుగు మంత్రి పదవులు, ఒక చీఫ్ విప్ ఇచ్చిన పేరు ఉంటుంది. మరి ఈ ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం కెసిఆర్ ఆశించిన ఫలితాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: