బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రేణిగుంట ఎయిర్ పోర్టులో విమానాలు దిగేందుకు వాతావరణం అనుకూలించడం లేదు. దీంతో హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. మరికొన్ని విమానాలను హైదరాబాద్ కు పంపిస్తున్నారు. అటు రేణిగుంట నుంచి వెళ్లాల్సిన విమానాలు కూడా ఆలస్యంగా బయల్దేరుతున్నాయి.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం వాయుగుండంగా మారగా.. చెన్నై సమీపంలో తీరం దాటింది. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45-65కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ ఈ ఆదేశాలు తప్పక పాటించాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని.. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలన్నారు.

అతి భారీ వర్షాలతో తిరుపతి నగరం పూర్తిగా జలమయమైంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తిరుమల కొండపై ఉదయం నుంచి వాన పడుతుండటంతో కపిల తీర్థం దగ్గర జలపాతం పోటెత్తుతోంది. తిరుమల గిరులపై నుంచి వరద కిందకు దూకుతోంది. ఇప్పటికే మెట్ల మార్గాన్ని మూసివేయగా.. ఘాట్ రోడ్డుపై కూడా కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు బ్రేక్ పడింది. వర్షాలు తగ్గేవరకు తిరుమలకు వెళ్లకపోవడమే మంచిది.


చిత్తూరు జిల్లాలోనే కాదు.. నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులపై వరద ప్రవాహంతో మూడు జిల్లాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు తిరుపతి నగరంలోని పలు కాలనీలు మునిగిపోయాయి. తిరుమలలో కొండ చరియలు, చెట్లు విరిగిపడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 50ఏళ్లలో ఇలాంటి వర్షాలు చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

 









మరింత సమాచారం తెలుసుకోండి: