ఏపీ పోలీసులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పూర్తిగా అధికార పార్టీ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయారని, వారికి వంతపాడుతున్నారని, వారికి మేలు చేసేలా ప్రవర్తిస్తున్నారని, ఎన్నికల దగ్గరనుంచి, ఇతర విషయాలన్నిటిలోనూ అధికార పార్టీ చెప్పినట్టే చేస్తున్నారనేది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈవివాదాలు, ఆరోపణల సంగతి పక్కనపెడితే.. ఏపీ పోలీస్ వ్యవస్థకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తుంపులు ఒకదానిక వెంట ఒకటి లభిస్తున్నాయి. స్మార్ట్ పోలీసింగ్ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి ఏపీ పోలీస్ వ్యవస్థ అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ నిర్వహించే సర్వేలో స్మార్ట్ పోలిసింగ్ అనే అంశంలో.. ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కి సంబంధించి 9 అంశాల్లో ఈ సర్వే చేపట్టారు. నేరుగా వ్యక్తులనుంచి వివరాలు సేకరించడంతోపాటు, ఆన్ లైన్ లో సర్వే చేపట్టారు. విశ్లేషించిన ఫలితాల్లో ఏపీ పోలీస్ డిపార్ట్  మెంట్ కి మొదటి స్థానం దక్కింది.

ఫ్రెండ్లీ పోలీసింగ్, జవాబుదారీతనం, ప్రజల్లో పోలీసులపై ఉన్న నమ్మకం వంటి విభాగాల్లో మొదటి స్థానం దక్కించుకున్నారు ఏపీ పోలీసులు. టెక్నాలజీ వినియోగం, పోలీస్ ల నుంచి వచ్చే స్పందన, అందుబాటులో ఉన్న పోలీస్ వ్యవస్థ, పోలీసుల ప్రవర్తన వంటి అంశాల్లో రెండో స్థానంలో నిలిచారు. 2014నుంచి ఏటా ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ఈ అవార్డులనిస్తోంది. ఏడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఈ ఏడాది రాష్ట్ర పోలీస్ శాఖ తొలిసారిగా మొదటి ర్యాంకు సాధించడం విశేషం. ఈ సందర్భంగా సీఎం జగన్ తోపాటు, హోం మంత్రి మేకతోటి సుచరిత పోలీస్ శాఖను అభినందించారు.

మరోవైపు పోలీసుల విషయంలో సీఎం జగన్ కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. సచివాలయాల్లో మహిళా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసి, వారిని పోలీస్ డిపార్ట్ మెంట్ లో కలిపే ఆలోచనలో ఉన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ లను కూడా ప్రవేశ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: