దేశంలో రైతు మరోసారి విజయం సాధించాడని గట్టిగా చెప్పుకోవాల్సి వచ్చిన సందర్భం నేడు చోటుచేసుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి తగ్గని బీజేపీ లేదా మోడీ, నేడు రైతుల కోసం చేసిన చట్టాలను రద్దు చేయడంలో వెనకడుగు వేసేట్టు చేసింది రైతు ఉద్యమం. ఎన్నో నెలలుగా సాగిన ఉద్యమంలో రైతులు చివరకు గెలిచారు. అయితే రైతు చట్టాలు అసలు ఏమిటో ఎవరికి అర్ధం కాకుండానే ఈ ప్రక్రియ జరగడం కాస్త లోటుగా అనిపించినా, రైతు తలుచుకుంటే ప్రభుత్వాలను దించగలడు లేదా అధికారం లో కూర్చుపెట్టనూ గలడు అనేది మరోసారి సుస్ప్రష్టం అయ్యింది. ఈ విజయం కేవలం రైతులది మాత్రమే. కాని విపక్షాలు తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజలకు వాస్తవాలు తెలుసు.

అయితే మొదటిసారి మోడీ వెనకడుగు వేయడం వెనుక అసలు కారణం రైతుల శ్రేయస్సా లేక కేవలం ప్రజలలో వ్యతిరేకత తాజా ఎన్నికలలో స్పష్టంగా చూడటం వలన వచ్చిన మార్పు మాత్రమేనా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశం. అందుకే ముందు న్న ఎన్నికల కోసమే ఇప్పటి నుండి బీజేపీ ఒకడుగు వెనక్కి వేసైనా తరువాత గెలుపును జేబులో వేసుకునే రాజకీయ అడుగు తప్ప, ఇందులో మరొకరి ప్రయోజనం లేదనేది అర్ధం అవుతుంది. నిజానికి రైతు చట్టాలు ఎంత ప్రయోజనమో అనేది కూడా బీజేపీ సరిగ్గా ప్రచారం చేయలేకపోవడం కూడా దీర్ఘకాల రైతు ఉద్యమానికి కారణం అయ్యింది. అంటే దీనివెనుక ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించే కుట్ర ఉన్నప్పుడు ప్రచారం చేసినా పెద్దగా దానిని ప్రజలలోకి వెళ్లనివ్వని విపక్ష వ్యూహం ముందు ఇంత కంటే తెలివైన నిర్ణయం లేదనేది బీజేపీ ప్రతివ్యూహం కావచ్చు.

ఏదేమైనా బీజేపీ ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేసింది అని స్పష్టం అవుతుంది. ప్రభుత్వం రైతుల కోసమే చేసిన చట్టం వారే అర్ధం చేసుకోలేనప్పుడు, అది ప్రభుత్వం మాత్రం బలవంతంగా రుద్దడం వలన ప్రయోజనం లేకపోగా వ్యతిరేకత పెరిగిపోవడం ఒక పార్టీకి అనవసరమైన విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది, అందుకే బీజేపీ పెద్దగా శ్రమ తీసుకోకుండా పార్టీని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న అనేక సమస్యల కంటే ఈ చట్టాల అమలు ఇప్పటికి పెద్ద విషయం కాదనేది కూడా మరో కారణం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: