తాజాగా రాష్ట్రంలో వెలువడిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం కాస్త మెరుగైన ఫలితాలు సాధించిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం సాధించినా సరే, టీడీపీ చాలా వరకు గట్టి ఫైట్ ఇచ్చింది. గత ఏడు నెలల క్రితం జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికలతో పోలిస్తే..ఈ సారి జరిగిన మినీ మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో టీడీపీలో చాలా మార్పు వచ్చింది. వైసీపీ అధికార బలం ఉపయోగించిన సరే గతం కంటే గట్టిగానే పోరాడారు.

ఎక్కడా తగ్గకుండా పోటీ చేసి వైసీపీకి పలు చోట్ల చెక్ పెట్టారు. అయితే చంద్రబాబు కంచుకోట కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోవడమే తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ మిగిలిన స్థానాల్లో కాస్త పికప్ అయ్యామని భావిస్తున్నారు. కాకపోతే ఇక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు కాస్త ఎక్కువ సంబరపడుతున్నట్లు కనిపిస్తోంది. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించామని భావిస్తూనే, అసలు తమకు ఎక్కువగా ప్రజా మద్ధతు పెరిగిందని అనుకుంటున్నారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో కేవలం టీడీపీకి 30 శాతం ఓటింగ్ వచ్చిందని, కానీ ఇప్పుడు 43 శాతం వరకు పెరిగామ ని చెబుతున్నారు. టీడీపీ నేతలు మీడియా సమావేశాల్లో, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే గత మున్సిపల్ ఫలితా ల్లో టీడీపీ గట్టి పోటీ ఇవ్వలేదు..ఇప్పుడు ఇచ్చి మెరుగైన ఫలితాలు సాధించింది. కానీ ఇక్కడే టీడీపీ నేతలు తెలుసుకోవాల్సింది ఏంటంటే...అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్‌ల్లో ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం.

కానీ తాజాగా మాత్రం 12 మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. అంటే ఇవి చాలా తక్కువ. వీటిల్లో ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని తమ్ముళ్ళు ఆనందపడితే ఉపయోగం లేదనే చెప్పాలి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉండవు. కాబట్టి వీటిల్లో ఓట్లు పెరిగాయని ఆనందపడకుండా ఇకపై ఇంకా ఎలా పోరాడాలని ఆలోచిస్తే బెటర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: