నూతన రైతు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై.. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ స్పందించారు. తమ పోరాటం ఇప్పుడే ఆపేయబోమని తెలిపారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. అలాగే కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం రైతులతో చర్చించాలని డిమాండ్ చేశారు.

ఇక కేంద్రం మూడు వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైతులు తమ సత్యాగ్రహంతో.. అహంకారం తలకెక్కించుకున్న కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించారన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన అన్నదాతలకు అభినందనలు అని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. గతంలో అన్నదాతలకు మద్ధతుగా తాను మాట్లాడిన వీడియోను రాహుల్ పంచుకున్నారు.

సాగు చట్టాల విషయంలో మొత్తానికి మోడీ సర్కార్ దిగొచ్చింది. మూడు చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్టు మోడీ ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు జరగాల్సిన ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో గెలిచి కేంద్రంలో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే ఎన్నికల కోసమే కేంద్రం దిగొచ్చిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరోవైపు వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతి నుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరారు. తమ ప్రయత్నంలోనే ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటుంది అన్నారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రైతులు ఆందోళన విరమించాలి.. మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు.

మొత్తానికి రైతులు తమ పంతం నెగ్గించుకున్నారు. కేంద్రం తలొగ్గేలా చేశారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం ఇలా చేసిందా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.







మరింత సమాచారం తెలుసుకోండి: