రాజకీయాల్లో ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు..కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఎగతాళి రాజకీయాలు చేయడం వల్ల...ప్రత్యర్ధులకు ఎంత నష్టం జరుగుతుందో తెలియదు గానీ, ఎగతాళి చేసిన నేతలకు మాత్రం బాగా నష్టం జరుగుతుందనే చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుని వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఎగతాళి చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయంగా కంటే చంద్రబాబుని వ్యక్తిగతంగానే ఎక్కువ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అందులోనూ కొడాలి నాని లాంటి వారైతే చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా ఏదైనా తప్పులు చేస్తే విమర్శించవచ్చు. అలా అని వ్యక్తిగత విమర్శలకు దిగకూడదు. బూతులు తిట్టకూడదు. ఇప్పుడు బూతులు వైసీపీ, టీడీపీ నేతలు ఇద్దరూ మాట్లాడేస్తున్నారు. మొన్న ఆ మధ్య టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్‌ని ఉద్దేశించి తిట్టడంతో ఎంత రచ్చ అయిందో తెలిసిందే.

ఈ బూతులు ఒకవైపు అయితే...వ్యక్తిగతంగా హేళన చేయడం మరొకవైపు అయింది. తాజాగా కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబుని జగన్‌తో సహ వైసీపీ నేతలు తెగ ఎగతాళి చేస్తున్నారు. తాము మంచి పనులు చేయడం వల్లే కుప్పంలో వైసీపీ గెలిచిందని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అది పట్టుకుని చంద్రబాబుని హేళన చేయడం కరెక్ట్ కాదనే అంశం ఎక్కువ వస్తుంది.

అసెంబ్లీలోనే జగన్‌తో సహ వైసీపీ నేతలు బాబుని ఆడేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు కూడా వైసీపీపై కౌంటర్ ఎటాక్‌కు దిగి..బాబాయ్ గొడ్డలి పోటు, తల్లికి ద్రోహం అంటూ ఫైర్ అయ్యారు. దీంతో వైసీపీ నుంచి ఇంకా దాడి పెరిగింది. కొడాలి, అంబటిలు ఏకంగా చంద్రబాబు భువనేశ్వరి గురించి పరోక్షంగా కాస్త వేరే స్థాయిలో అర్ధం వచ్చేలా మాట్లాడారు. దీంతో బాబు...తనని అవమానిస్తే భరించానని, కానీ తన భార్యని తీసుకొచ్చారని, ఇక సభలో ఉండలేనని, సీఎం అయ్యేవరకు రానని సభ నుంచి వెళ్ళిపోయారు. ఇక మీడియా సమావేశంలో తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు.

ఇటు జగన్ సైతం....బాబువి డ్రామాలు అని, తన బాబాయి, తల్లి గురించి మాట్లాడారని, తమ వాళ్ళు కూడా స్పందించారని, దానికి డ్రామాలు ఆడుతూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారని జగన్ కౌంటర్ ఇచ్చారు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని చాలా అవమానాలకు గురి చేశారు. దాని వల్ల 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో వైసీపీ నేతలు కూడా గుర్తుంచుకుంటే బెటర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఏదేమైనా ఏపీ రాజకీయాలు మాత్రం బాగా హద్దులు దాటాయని చెప్పొచ్చు. ఇక బూతులు, అసభ్యంగా మాట్లాడుకోవడాలు చూస్తుంటే...సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లో కూడా సెన్సార్ ఉండాలనే స్థాయికి తీసుకెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: