టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం అయ్యేంతవరకూ అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు. వైసీపీ నేతలు తన కుటుంబ సభ్యులపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. బాబు సతీమణి భువనేశ్వరిని కూడా ఈ రచ్చలోకి లాగడంతో ఓర్చుకోలేక వెక్కి వెక్కి ఏడ్చారు. తనపై ఇన్నాళ్లూ దారుణమైన బూతులతో విమర్శలు చేసినా తట్టుకున్నానని, ఇకపై భరించలేనని ఆవేదన చెందారు. మళ్ళీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పి.. సభ నుంచి బయటకు వచ్చేశారు.

అయితే చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తారా..? లేక మరికొంతకాలం వేచి చూస్తారా అనేది తేలాల్సి ఉంది. కుప్పం ఎన్నికలలో టీడీపీకి ఎదురుదెబ్బ తగలడంతో చంద్రబాబుకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ప్రజల్లో టీడీపీపై మరింత నమ్మకం కలిగించాలని బాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సాధారణ ప్రచారం, వ్యూహాలు కుప్పం స్థానిక ఎన్నికలలో పని చేయలేదు. ఆయన అనుభవం మొత్తం ఉపయోగించినా టీడీపీని అవేమీ గట్టెక్కించలేకపోయాయి. పార్టీ తరపున లోకేష్ ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో చంద్రబాబు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. దీంతో చంద్రబాబు ఇప్పుడు మరో కొత్త వ్యూహానికి తెర తీయాల్సి వచ్చింది.

చంద్రబాబు ఇకపై ప్రజల్లోనే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండేలా చూసుకోవాలని ఆయన అనుకుంటున్నారట. పాదయాత్రలు, బస్సు యాత్రలు, నిరసనలు, ఆందోళనలతో ఇలా ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వ పాలనపై దండయాత్ర చేయాలనీ డిసైడ్ అయ్యారట బాబు. బాబు కన్నీళ్లు పెట్టుకున్న కొద్దిసేపటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనలు చేయడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఇకపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఏ అవకాశాన్ని వదలకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే బాబు నిర్ణయం ఇలా ఉంటే.. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: