చంద్రబాబు ఏడ్చాడు.. చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు. వైసీపీ నేతలు చేసిన అవమానం భరించలేక చంద్రబాబు గుండెలవిసేలా రోదించాడు.. నిజమే.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి.. దాదాపు 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి.. దేశ ప్రధానులను, రాష్ట్ర పతులను ఎంపిక చేసిన వ్యక్తి.. జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపిన వ్యక్తి.. అమెరికా అధ్యక్షులతోనూ ప్రశంసలు పొందిన వ్యక్తి.. ఇలా ఒక్కసారిగా దుఃఖం ఆపుకోలేక ఏడుస్తుంటే.. అందులోనూ బహిరంగంగా లైవ్ టెలికాస్ట్ అని తెలిసీ ఏడుస్తుంటే.. ఎవరికైనా బాధ కలుగుతుంది.. అయ్యో.. ఎంతటి పరిస్థితి వచ్చింది అని అనిపించక మానదు.


అయ్యో.. అనడానికి పార్టీలతో పని లేదు.. వాదాలతో పని లేదు. మనిషి ఆక్రందనలోనూ రాజకీయం ఉంటుందని భావించలేం.. అంటే అంత కన్నా నీచం ఉంటుదని కూడా భావించలేం.. అయితే ఇక్కడ చంద్రబాబు ఓ విషయం గమనించాలి. ఆయన పదే పదే కొన్ని విషయాలు మాట్లాడటం కూడా తగ్గించాలి. అవసరం అయిన దగ్గర మాట్లాడటం ఎంత అవసరమో.. అనవసరం అయిన దగ్గర మాట్లాడటం కూడా అంతే అనవరసం.. ముఖ్యమైన విషయం మాట్లాడేటప్పుడు అనవరస విషయాలు ప్రస్తావిస్తే.. చెప్పాల్సిన విషయం సరిగ్గా వినేవాడికి చేరదు.


చంద్రబాబు ఇప్పటికే అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా కొన్ని విషయాలు చెప్పడం మానేయాలి.. అవేంటంటే.. నేనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా అనే మాట. అది నిజమే కావచ్చు.. ఆ విషయం కేటీఆర్ కూడా ఒప్పేసుకున్నాడు.. ఇక దాన్ని పదే పదే ప్రస్తావించడం బావుండదు. అలాగే.. ఆయన నా దగ్గరే మంత్రిగా పని చేశాడు. ఈయనకు నేనే రాజకీయ భిక్ష పెట్టా.. అనే మాటలు కూడా అంత శోభస్కరంగా అనిపించవు.. నిజమే.. తెలుగు దేశం పార్టీ ఎందరికో అవకాశాలు కల్పించింది.. కానీ.. నాదగ్గరే పని చేశాడు అని పదే పదే అంటే.. వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది..


ఇంకా ఆయన 14 ఏళ్లు సీఎంగా పని చేశా.. వాజ్‌ పేయి వంటి నేతలతో ప్రశంసలు పొందా.. అమెరికా అధ్యక్షులు కూడా మెచ్చుకున్నారు.. ఇలాంటివన్నీ ఇంకా చంద్రబాబు చెప్పడం మానేయాలి. మన డబ్బా మనం ఎక్కువగా కొట్టుకుంటే.. అసలు విషయం పక్కకు వెళ్తుంది. వచ్చే గుడ్ ఫీల్ కూడా రాకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: