నిన్న మొన్న‌టి వ‌ర‌కు ధాన్యం కొనుగోలు విష‌యంలో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసిన కాషాయ నేత‌లు ఒక్క‌సారిగా గ‌ప్‌చుప్ అయ్యారు. రైతుల కోసం తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌ధాని న‌రేంద్ర మోడి స్వ‌యంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ అంశం పై స్పందించేందుకు రాష్ట్ర బీజేపీకి చెందిన ఒక్క నాయ‌కుడు కూడా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొనసాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని సమ‌ర్థిస్తూ క‌నీసం ఒక్క ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేయక‌పోవ‌డం ఆశ్య‌ర్యాన్ని క‌లిగిస్తోంది.


 అయితే, ఇన్నాళ్లు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు గొప్ప‌వి అంటూ చెప్పుకొచ్చిన రాష్ట్ర బీజేపీ నాయ‌కులు మూడు చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రిస్తున్న‌ట్టు ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న త‌రువాత మిన్న‌కుండిపోయారు. దీనికి కేంద్రం నుంచి వ‌చ్చిన ఆదేశాలే కార‌ణ‌మ‌ని స‌మాచారం. కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఇప్ప‌టికే  రైతులు, ప్ర‌తిప‌క్షాలు గుర్రుగా ఉన్నారు. అలాగే, ధాన్యం కొనుగోలు విష‌యంలో బాయిల్డ్ రైస్ కొన‌లేమ‌ని ఇప్ప‌టికే కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో లేనిపోని కామెంట్లు చేసి ఇబ్బందుల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రావ‌డంతోనే క‌మ‌ళం దండు మాట్లాడ‌డం లేద‌ని తెలుస్తోంది.



  మ‌రోప‌క్క మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు ఎన్నిక‌ల కోసం మాత్ర‌మే చేశార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పాటు ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం ఉంద‌ని కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అలాగే రాబోయే సంవ‌త్సరంలో కీల‌క‌మైన ఉత్త‌రప్ర‌దేశ్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖాండ్, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలోనే బీజేపీ వ్య‌వ‌సాయ సాగు చ‌ట్టాల ఉప‌సంహ‌రించుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నాలు వేస్తున్నారు. ఈ ర‌ద్దు విష‌యంపై రాష్ట్ర క‌మ‌ల‌ద‌ళం నాయ‌కులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: