కొద్ది రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించిన కేంద్రం.. సడన్ గా సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం ప్రజలతో పాటు ప్రతిపక్షాలను కూడా ఆశ్చర్యపరిచింది. అయితే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇతర మార్గాల్లో సాగు చట్టాలను తీసుకురాదనే నమ్మకం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాలను అధికారంలో ఉన్నంతకాలం మళ్లీ ప్రవేశపెట్టబోమనే స్పష్టమైన హామీ బీజేపీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

దాదాపు 11 నెలల పాటు అలుపెరుగని పోరాటం ప్రదర్శించిన రైతులు అనుకుంది సాధించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్న కేంద్రం.. రైతుల ఉద్యమానికి దిగివచ్చి రద్దు చేస్తామని ప్రకటించింది. గతేడాది నుంచి చలి, ఎండ, వర్షం లెక్క చేయకుండా రోడ్లపై ధర్నాలు చేశారు. ప్రభుత్వం నీళ్లు, కరెంట్ కట్ చేసినా వెనుకడుగు వేయలేదు. అనారోగ్యం, చలికి వందల మంది మరణించారు. పోరాటం చేస్తే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు.

ప్రధాని మోడీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో అసలు ఏమిటీ సాగు చట్టాలు..? రైతులు ఎందుకు వీటిని వ్యతిరేకిస్తున్నారు..? అనే వాదన మళ్లీ తెరపైకి వచ్చింది. అన్నదాతల పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయంలో ప్రైవేట్ పెట్టుబడులు, టెక్నాలజీ సంబంధిత అంశాలపై కేంద్రం రూపొందించిన చట్టాలే ఈ మూడు సాగు చట్టాలు. అయితే ఇవి రైతులకుకీడు చేసేలా ఉన్నాయంటూ రైతులు ఢిల్లీలో ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు.

మరోవైపు నేడు దేశవ్యాప్తంగా కిసాన్ విజయ్ దివాస్ ర్యాలీ కాంగ్రెస్ చేపట్టింది. కేంద్రం లోపభూయిష్ట నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. కిసాన్ విజయ్ ర్యాలీని అన్ని రాష్ట్రాల్లో జరపాలని రాష్ట్ర యూనిట్లను ఆదేశించింది. ఈ ర్యాలీలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించింది. కేంద్రం గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను ప్రజలకు వివరించాలని తెలిపింది. చూద్దాం.. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో లేదో.












మరింత సమాచారం తెలుసుకోండి: