బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముంబైలోని సముద్రంలో ఓ క్రూయిజ్‌లో జరిగిన పార్టీ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఆ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారంటూ ఆర్యన్ ఖాన్ సహా పలువురిని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన  పరిణామాలు ఏకంగా మహారాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసేలా మారిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రికి, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇదే కేసు కీలక మలుపు తిరిగింది. ఆర్యన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ అధికారులు... డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ను ప్రధాన కుట్రదారుగా చిత్రీకరించారు. ఇందుకు ఆర్యన్ ఖఆన్ వాట్సప్ ఛాట్‌ను రుజువుగా మార్చింది. కుట్రకు సంబంధించి ఇందులో కీలక ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పుడు బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎన్‌సీబీ అధికారులు చేసిన ఆరోపణలను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. డ్రగ్స్ వ్యవహారం, పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్‌ మిత్రులు అర్బజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలతో వాట్సాప్‌లో ఛాట్ చేశారని... అందులో డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించారని ఎన్‌సీబీ ప్రస్తావించింది. డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు, పార్టీ ఏర్పాట్లు వంటి కీలక విషయాలు ఈ ఛాట్‌లోనే ఉన్నాయని ఆరోపించింది. ఇదే విషయంపై బాంబే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ వాదనల్లో ఎన్‌సీబీ అధికారుల వాదనను బాంబే హైకోర్టు తోసి పుచ్చింది. ఆర్యన్ ఖాన్ దగ్గర ఎలాంటి మాదక ద్రవ్యాలు లేవని హైకోర్టు తేల్చింది. అలాగే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్ ఖాన్, అర్బజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు ఎలాంటి కుట్రలు చేయలేదని... ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. హై ప్రొఫైల్ కేసు కావడంతో... ఎన్‌సీబీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు తొలి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే వ్యవహారం తొలి నుంచి వివాదాస్పదంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: