బాబు కన్నీరు పెట్టుకున్నారు, వైసీపీ నేతలు దాన్ని నాటకం అంటున్నారు. కుటుంబ సభ్యుల్ని అవమానించారని చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ప్రజలకోసం, ఏపీ కోసం ఆయన ఎప్పుడూ ఆ స్థాయిలో భావోద్వేగాన్ని చూపలేదు, చూపించే అవసరం కూడా రాలేదు. ఇటు వైసీపీ నేతలు కూడా చంద్రబాబు వ్యవహారంలో ఎదురు దాడి తీవ్రతరం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు ఏపీ ప్రజలకు ఒరిగిందేమిటనేదే అసలు ప్రశ్న.

వైసీపీ హయాంలో కార్పొరేషన్ల పేరుతో సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు సీఎం జగన్. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి, వారికి వేతనాలు కూడా ప్రకటించేసి, సకల సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ లబ్ధి చెందింది ఆయా సామాజిక వర్గాలకు చెందిన ప్రజలా, లేక కార్పొరేషన్ చైర్మన్ లా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కార్పొరేషన్ల పేరుతో కొత్తగా ఏర్పాటైన సంస్థలు ప్రజలకు చేసేదేమీ లేదు. కొత్తగా వాటికి నిధులు లేవు, కొత్తగా ప్రకటించిన పథకాలు లేవు. అప్పటికే అమలులో ఉన్న పథకాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అని చూడటమే కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యత, ఇక డైరెక్టర్లు ఏం చేస్తారు, వారి విధులేంటి అనేదానిపై ఇంతవరకు ఓ క్లారిటీ లేదు. కార్పొరేషన్ల పేరుతో కొలువుల జాతర జరిగింది కానీ.. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఆ స్థాయిలో భర్తీ కాలేదు. అంటే రాజకీయ నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం బాగానే న్యాయం చేయగలిగింది. అసలైన నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు.

పోనీ ఇలాంటివాటిపై టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా, ప్రజల పక్షాన పోరాడుతోందా అనుకుంటే అదీ లేదు. కుప్పంలో ఓడిపోతే బాబుకి తలకొట్టేసినట్టు ఉంది, ఇటు ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే మాత్రం ఆయనకు పెద్ద బాధేమీ లేదు. అధికారం లేదు కదా.. ఒక్క ఛాన్స్  అనే సరికి మీరే జగన్ ని నమ్మి ఓట్లేశారు అని పదే పదే చెబుతుంటారు చంద్రబాబు. ప్రతిపక్షం నిజంగా పోరాటం చేస్తే ప్రజలు మద్దతివ్వలేమని ఎందుకంటారు. రాజకీయ స్వలాభం లేకుండా నిజంగా ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం టీడీపీ పోరాటం చేయట్లేదు, అలాగని వైసీపీ అందరికీ న్యాయం చేయాలనుకోవట్లేదు. అధికారంకోసం బాబు, జగన్ మధ్య జరిగే ఈ యుద్ధంలో ప్రజలే అమాయకుల్లా మిగిలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: