చంద్రబాబు, జగన్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో.. ఏపీ ప్రజల్ని పట్టించుకునే తీరిక, ఓపిక ఎవరికీ లేకుండా పోతోంది. అధికారాన్ని మరో పదిహేనేళ్లు నిలుపుకొనేందుకు పథకాల పేరుతో ప్రజల్ని ఆకట్టుకోడానికి జగన్ ప్రయత్నిస్తుంటే, కోల్పోయిన అధికారాన్ని ఎలా సాధించాలా అనే ప్రణాళికతో చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వాస్తవానికి అధికార, ప్రతిపక్షాలు ఆధిపత్యపోరు వదిలిపెడితేనే ప్రజలపై దృష్టిపెట్టగలరు. కానీ ఇక్కడ ఏపీలో ఆధిపత్య పోరుకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి ఇరు వర్గాలు. టీడీపీ ఓటు బ్యాంక్ ని మరింతగా తగ్గించడానికి వైసీపీ సీరియస్ గా ప్రయత్నిస్తోంది. 2024నాటికి వైసీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలని టీడీపీ ఆలోచిస్తోంది.

ఉద్యోగులు ఎవరివైపు..?
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యవస్థలపై విమర్శలు గట్టిగానే సంధించారు. ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నప్పుడు అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తామన్నారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే అంటోంది. పోలీస్ వ్యవస్థ వైసీపీకి వంతపాడుతోందని ఆరోపిస్తోంది. కానీ ఉద్యోగులు ఎటువైపున్నారు. రెవెన్యూ ఉద్యోగులయినా, పోలీసులయినా ప్రభుత్వాలు చెప్పినట్టు వింటున్నారా, లేక తమ విధులు తాము నిర్వహిస్తున్నారా..? ఉద్యోగులు తమ విధులు తాము సరిగా నిర్వర్తించినా.. అది అధికార పక్షానికే మేలు చేస్తుందనేది ప్రతిపక్షాల వాదన. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఇవే నిందలు వేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ఉద్యోగులపైనే నిందలు వేస్తున్నారు.

ఉద్యోగులు ఏం సాధించారు...?
నిజంగానే జగన్ చెప్పినట్టు ఉద్యోగులు చేస్తున్నారని అనుకుందాం.. దానివల్ల ఉద్యోగులకు వచ్చిన లాభమేంటి..? సీపీఎస్ రద్దయిందా? పీఆర్సీ ప్రకటించారా..? అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, రెండున్నరేళ్లు గడిచినా దాని ఊసే లేదు. అసలు దాని గురించి మంత్రులు కానీ, సలహాదార్లు కానీ.. ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఇక పీఆర్సీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఉన్న ఉద్యోగులకు జీతాలివ్వడమే కష్టసాధ్యమవుతున్న ఈ సమయంలో పీఆర్సీకోసం ఎదురు చూడటం అత్యాశ అనే విషయం ఉద్యోగులకు కూడా తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి నెప్పి తెలియకుండా ప్రశ్నిస్తున్నారు.

అంతిమంగా నష్టపోతోంది ఉద్యోగులేనా..
పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం న్యాయం జరిగిందో అందరికీ తెలిసిందే.  నిందలు మాత్రంత రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. ఫలానా ప్రభుత్వానికి బానిసలుగా ఉండటం ఎవరికీ ఇష్టం ఉండదు. అదే సమయంలో ప్రభుత్వానికి ఎదురెళ్లి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవాలని కూడా సగటు మధ్యతరగతి ఉద్యోగి అనుకోడు. అందుకే ఇలా మధ్యలో ఉండిపోయి నిందలు భరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: