ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం క్లారిటీ ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి ప‌య‌న‌మయ్యారు. మంత్రులు, అధికారుల బృందంతో క‌లిసి ఢిల్లీ వెళ్తాన‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. ఇక‌పై తెలంగాణ‌లో పండే పంట‌లో ఏడాదికి ఎంత కొంటారో అనే విష‌యంపై తేల్చుకునేందుకు హ‌స్తిన‌కు వెళ్లనున్నారు కేసీఆర్‌. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితం అనంత‌రం కేసీఆర్ బీజేపీ పై ఒంటి కాలుపై నిల్చుంటున్నారు. ఎప్పుడు లేని రీతిలో కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల తూటాలు పేల్చారు. కేంద్ర ప్ర‌భుత్వాల విధానాల‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున గ‌ళం వినిపిస్తాన‌ని, ఢిల్లీలో మంట పెడుతాన‌ని అన్నారు.
 

  తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట‌ను కొంటారా.. లేదా అని పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ ధాన్యాన్ని కూడా కొనాల‌ని ఈ విష‌యం స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ధ‌ర్నాచౌక్ ద‌గ్గ‌ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జా ప్రతినిధుల‌తో క‌లిసి ధ‌ర్నా నిర్వ‌హించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. రెండు రోజులు డెడ్‌లైన్ పెట్టినా కేంద్రం ఎలాంటి స్పంద‌న తెలుప‌క‌పోవ‌డంతో ఢిల్లీలోనే తేల్చుకునేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. అయితే, గ‌తంలో అనేక సార్లూ ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు కొత్త ర‌కంగా వెళ్తున్నారు.

 

 ఇన్ని రోజులు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి తెరచాటు స్నేహ హ‌స్తం అందించి త‌న‌కు కావాల్సిన ప‌నుల‌ను పూర్తి చేయించుకున్నారు. దానికంటే ముందు గ‌తంలో కేంద్రానికి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు. ఇందులో భాగంగానే ఇత‌ర రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ, స్టాలిన్‌,, న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను క‌లిశారు. కానీ, త‌రువాతి క్ర‌మంలో అది అనుకున్నంత స‌క్సెస్ కాక‌పోవ‌డంతో.. కేసీఆర్  కేంద్రంతో స‌ఖ్య‌త కొన‌సాగించాడు. మ‌ళ్లీ ఇన్ని రోజుల త‌రువాత ఇప్పుడు కేంద్రం పై స‌మ‌ర శంకం పూరించారు. ఇక ఢిల్లీలో యుద్ధ‌మే అన్న రీతిలో కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇదే దూకుడును కేసీఆర్ ఎంత‌వ‌ర‌కు కొన‌సాగిస్తారు.? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: