ఏపీలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా గ్రామాలను వరద ముంచెత్తడంతో ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఇళ్లలోని వస్తువులు పూర్తిగా కొట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా తెగిపోవడంతో గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు తోడుగా ఉండాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానవసరం లేదనీ.. తమ ప్రాంతాల్లోనే ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.

వరద ప్రభావిత జిల్లాల్లోని ప్రజలకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు 25కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలు ఉచితంగా సరఫరా చేయనున్నారు. భారీ వర్షాలు కురిసిన చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు ఈ సాయం అందనుంది.

వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఉదారంగా ఆదుకోవాలని.. మృతుల కుటుంబాలకు తక్షణమే 5లక్షల రూపాయలు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చెయ్యేరు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని.. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికే కాకుండా ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలన్నారు సీఎం. తిరుపతిలో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.


ఇక తిరుపతి రామచంద్రాపురంలోని రాయల చెరువుకు గండిపడే ప్రమాదం ఉన్న కారణంగా.. దిగువన ఉన్న పలు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సంతబయలు, ప్రసన్న వెంకటేశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డి గారి పల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, రామచంద్రాపురం, మెట్టూరు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమైంది.





మరింత సమాచారం తెలుసుకోండి: