వరదల్లో రాష్ట్రవ్యాప్తంగా 24మంది చనిపోతే.. సీఎం జగన్ ఏం చేస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. బాధితులకు కనీసం ఆహారం, తాగునీరు ఇచ్చే దిక్కు లేకుండా పోయిందని.. ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తూ జగన్ కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. వర్షాలకు సంబంధించి వాతావరశాఖ హెచ్చరికలపై జగన్ దృష్టి పెట్టి ఉంటే.. ఇంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదన్నారు.

వరదలతో ప్రజలు అల్లాడుతుంటే.. ఏం జరిగిందో కనుక్కోకుండా తీరిక లేని సమయం గడుపుతున్న సీఎం జగన్ ను ఏమనాలని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ప్రజలు వరదల్లో కొట్టుకుపోతుంటే.. ఏరియల్ సర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నారని.. ఇప్పటికైనా జగన్ నేలపైకి వస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే భారీగా  ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని లోకేశ్ ఆరోపించారు.

అంతేకాదు రాయలసీమలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే.. సీఎం జగన్ పెళ్లికి హాజరవడంపై నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని నమ్మలేకపోతున్నా..! రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వరదలకు అతలాకుతలమై.. ఎంతో మంది ప్రాణాలు పోతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్లను ఆదుకునేది పోయి.. పెళ్లిళ్లకు వెళ్తున్నారు. రాయలసీమను కాపాడండి అని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ఇసుక అమ్ముతామని ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు పంట నష్టం జరుగుతోందనీ.. పచ్చటి పొలాల్లో ఇసుక మేటలు వేసి వాళ్లంతా ఏడుస్తుంటే. వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతామని ప్రకటలు చేస్తోందన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అంటూ సోషల్ మీడియాలో విమర్శించారు. పవన్ కళ్యాణ్, లోకేశ్ ల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: