కేసీఆర్.. ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించడంలో దిట్ట.. తాజాగా ఇప్పుడు ఆయన చూపు జాతీయ రాజకీయాలపై పడింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడం ఇదేమీ కొత్త కాదు.. గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ పెడతా అంటూ కాస్త హడావిడి చేసి ఆ తర్వాత చల్లబడ్డారు. మళ్లీ ఇప్పుడు రైతు ఉద్యమాలపై ఉపన్యాసాలు దంచుతున్నారు. దేశం మొత్తం గత్తర లేపుతా అంటున్నారు. అందుకు అనుగుణంగానే సాగు చట్టాలపై  పోరాటం చేస్తూ అసువులు బాసిన 700 మంది వరకూ రైతులకు రూ. 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు కేసీఆర్.


ఎక్కడో దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమంలో మరణిస్తే.. తెలంగాణ సర్కారు మూడు లక్షల రూపాయల పరిహారం ప్రకటిస్తే.. మరి సాగు చట్టాలు చేయడం ద్వారా తప్పు చేశాం మొర్రో.. క్షమించండి రైతులారా అంటున్న మోడీ సర్కారు ఇంకెంత పరిహారం ఇవ్వాలి.. ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు రైతు సంఘాలు నేతలు. ‘కేంద్ర ప్రభుత్వం తన తప్పిదాన్ని ఒప్పుకొని సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినందున తప్పకుండా మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.


సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతోన్న నిరసనల్లో 700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రైతు నాయకులు చెబుతున్నారు. దిల్లీ సరిహద్దులో కొనసాగిన ఆందోళనల సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. లఖింపూర్‌ కారు దాడిలో మరణించిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. ప్రధాని ఆధ్వర్యంలోని పీఎం కేర్స్‌లో లెక్కకు రాని డబ్బు ఎంతో ఉందంటున్న రైతులు.. కేవలం రైతులకు క్షమాపణ చెబితే సరిపోదని గుర్తు చేస్తున్నారు.


అంతే కాదు.. సాగు చట్టాలను రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఉద్యమం ఆపేది లేదంటున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని.. రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: