ఢిల్లీలో సాగు చట్టాల పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు 3లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని.. ఎంతమందికి పరిహారం అందిందనీ నిలదీస్తున్నారు. అలాగే 1200మంది అమరవీరుల కుటుంబాలకు ఏమిచ్చారని అడుగుతున్నారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేపిస్తాడట అనే కేసీఆర్ డైలాగ్ ను గుర్తు చేసుకుంటున్నారు.

అంతేకాదు కేసీఆర్ ఢిల్లీపై పోరాటం చేస్తానని ప్రకటించడం వల్లే కేంద్రం వ్యవసాయ చట్టాల రద్దు చేసిందని కొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 11నెలలుగా ఎన్నో కష్టాలు దిగమింగుతూ పోరాటం చేసిన రైతులకు క్రెడిట్ ఇవ్వరా..? అని ప్రశ్నిస్తున్నారు. తొలుత వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపిన కేసీఆర్.. మళ్లీ ఎందుకు వ్యతిరేకించారని నిలదీస్తున్నారు.

సీఎం కేసీఆర్ ధర్నా చేస్తే మోడీ వ్యవసాయ చట్టాలు రద్దు చేశారనడం విడ్డూరంగా ఉందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ధర్నా రాష్ట్ర రైతుల కోసమా..? పంజాబ్ రైతుల కోసమా..? అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్ల కోసమే కేసీఆర్ పోరాటం  అని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉందన్న బండి.. రాష్ట్రంలో చనిపోయిన రైతులకు డబ్బులివ్వని కేసీఆర్.. పంజాబ్ రైతులకు ఇస్తారా..?  అని నిలదీశారు.

కేంద్రం ఎన్ని రకాలుగా హింసించినా.. రైతులు వెనక్కి తగ్గలేదని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల విజయాన్ని కేసీఆర్ గొప్పగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారనీ.. కేసీఆర్ ఒక్కరోజు ధర్నాకు మోడీ దిగివస్తారా..? అని ప్రశ్నించారు. మరి ధాన్యం కొనుగోలులో ఎందుకు దిగిరావడం లేదని నిలదీశారు. కేసీఆర్ ఎప్పుడూ మోడీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు.


చూద్దాం.. ముఖ్యమంత్రి కేసీఆర్.. నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం పోరాడి చనిపోయిన కుటుంబాల విషయంలో మాట నిలబెట్టుకుంటారో లేదో.

 
మరింత సమాచారం తెలుసుకోండి: