అమరావతి రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన ఈ దీక్ష ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న రైతులకు టీడీపీతోపాటు బీజేపీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. రైతుల పాదయాత్రకు బీజేపీ, జనసేన నేతలు పెద్ద ఎత్తున హాజరై వారికి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర తిరుమల చేరుకునేలోగా సీఎం జగన్ అమరావతిపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధానికి అనుకూలంగా ప్రకటన చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజధాని పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు.

నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పురంధరేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, వాకాటి నారాయణరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే నిన్నమొన్నటివరకూ పాదయాత్రకు ఆంక్షలు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు సడెన్ గా రూటు మార్చారు. అమరావతి రాజధాని రైతుల యాత్రలో 150 మందిలోపే పాల్గొనాలనే నిబంధన ఉందని..అందుకు అనుగుణంగానే నడుచుకోవాలని పోలీసులు చెబుతూ వచ్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ నెల్లూరు జిల్లాలోకి వచ్చేసరికి ఒక్కసారిగా పోలీసుల తీరు మారిపోయింది.

ప్రకాశం జిల్లాలో నిబంధనలు మీరిన సందర్భంగా పోలీసులు ఒకసారి పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నెల్లూరు జిల్లా పాదయాత్రలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే నెల్లూరుజిల్లాలో పాదయాత్రను బీజేపీ నాయకులే నడిపిస్తున్నారు. వెనకుండి ఏ ఇబ్బందీ లేకుండా పాదయాత్రకు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు జిల్లా పోలీసులు మొత్తం పెన్నా వరదల సహాయక చర్యల్లో ఉండిపోయారు. బందోబస్తు కూడా నామమాత్రంగానే చేయాల్సి వస్తోంది. మీడియా ఫోకస్ కూడా వరద ప్రభావంపైనే ఉంది. దీంతో అమరావతి రైతుల పాదయాత్రలో పోలీసుల హడావిడి తగ్గింది. పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటుండటంతో.. అటు అమరావతి యాత్రలో రాజకీయ నాయకుల హడావిడి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: