చనిపోయాడని అంతా భావించిన వ్యక్తి తిరిగి బతికొస్తే అది విడ్డూరమే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. చనిపోయాడని భావించి చితిపైకి చేర్చాక కూడా అతడు బతికి లేచి కూర్చున్న ఘటనలూ చూశాం.. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కూడా అలాంటిదే.. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే.. చనిపోయాడనుకుని అతడి బాడీని ఏకంగా ఫ్రీజర్‌లో ఆరు గంటల పాటు ఉంచినా అతడు బతికి బట్టకట్టడం.. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగింది.


ఇంతకీ అసలేమైందంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన శ్రికేష్‌ కుమార్‌ అనేక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను స్థానికులు అర్జంటుగా దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ అతనిడి పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతడు మరణించాడని తేల్చేశారు. రోడ్డు ప్రమాదం కాబట్టి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి మృత దేహాన్ని తీసుకెళ్లారు.


అతని వద్ద ఉన్న ఆధారాల కారణంగా.. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతడి కుటుంబ సభ్యులు వచ్చే వరకు బాడీ పాడు కాకుండా శ్రికేష్‌ కుమార్‌ ప్రభుత్వ ఆస్పత్రి  మార్చురీలోనే ఓ ఫ్రీజర్‌లో ఉంచారు. ఆరు గంటల తర్వాత అతని కుటుంబ సభ్యులు రోదించుకుంటూ వచ్చారు. మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తీసుకెళ్దామని ప్రయత్నిస్తున్న సమయంలో అతని గుండె కొట్టుకుంటోందని గుర్తించారు. దీంతో హుటాహుటిన మళ్లీ అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడం ప్రారంభించారు.  


ప్రస్తుతం శ్రికేష్‌ను ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని.. ఆయన కోమాలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినా..  దాదాపు 6 గంటలకుపైగా ఫ్రీజర్‌లో ఉంచినా న్నప్పటికీ అతడు బతికుండటం ఓ అద్భుతమే అంటున్నారు వైద్యులు కూడా. ఈ ఘటన సంచలనం సృష్టించడంతో అసలు ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ముందుగా వైద్యం అందించిన ప్రైవేటు ఆస్పత్రి వర్గాలనూ సంప్రదిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: