హైదరాబాద్‌.. అద్భుతమైన నగరం.. అన్ని ప్రాంతాల వారు తమ సొంత నగరంగా భావించే నగరం.. దక్షిణాదిలోనే అత్యున్నత ప్రమాణాలు ఉన్న నగరం.. 400 ఏళ్లకుపైబడి చారిత్రక నేపథ్యం ఉన్న నగరం.. ఇప్పటికీ అతి తక్కువ ఖర్చుతో సామాన్యుడు కూడా బతుకుబండి సాగించే అవకాశం ఉన్న నగరం.. దేశంలో ఏ మూల నుంచి వచ్చినా ప్రేమగా అక్కున చేర్చుకునే నగరం.. ఇలా హైదరాబాద్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలో.


కానీ ఇంత మంచి హైదరాబాద్ కు ఇప్పుడు కొన్ని అంశాల కారణంగా చెడ్డ పేరు వస్తోంది. ఇటీవలి కాలంలో డ్రగ్స్ కారణంగా హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతోంది. దక్షిణాది నుంచి డ్రగ్స్ అడ్డాగా హైదరాబాద్‌ ప్రసిద్ధి చెందుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌ మీదుగా గుట్టుగా మాదకద్రవ్యాల రవాణా విదేశాలకు సాగుతోందని తెలుస్తోంది. దీని వల్ల సౌతిండియా డ్రగ్స్ హబ్‌గా హైదరాబాద్ మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి.


హైదరాబాద్ నుంచి డ్రగ్స్ కొన్ని అంతర్జాతీయ కొరియర్‌ ఏజెన్సీల ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జర్మనీ వంటి దేశాలకు సరఫరా అవుతున్నాయట. కేజీల కొద్దీ మెఫిడ్రిన్‌, ఎఫిడ్రిన్‌, సూడో ఎఫిడ్రిన్‌ వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాలు సరిహద్దులు దాటిపోతున్నాయట. ఇటీవలి కాలంలో దొరికిన కొందరు డ్రగ్స్ పెడ్లర్‌ల విచారణలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయట.


ఇటీవల ఫొటో ఫ్రేముల్లో ఆస్ట్రేలియాకు తరలిస్తున్న రూ.5.5 కోట్ల విలువైన ఎఫిడ్రిన్‌ పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తే.. ఈ డ్రగ్స్ ముఠాతో ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లోని డ్రగ్స్‌ మాఫియాకు సంబంధం ఉందని తేలిందట. అంతే కాదు.. తమ దేశానికి ఎఫిడ్రిన్‌, మెఫిడ్రిన్‌ ఎక్కడి నుంచి వస్తోందని అమెరికా వర్గాలు చేసిన పరిశోధనలోనూ హైదరాబాద్ పేరే వినిపించిందట. దీంతో ఇటీవల అమెరికా అధికారులు  హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి పోలీసు ఉన్నతాధికారులతో ఈ అంశం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఇకనైనా కేటీఆర్ వంటి మంత్రులు ఈ అంశంపై దృష్టి సారించి హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్ రవాణాను అరికట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: