ఏపీలో జరిగే రాజకీయాలకు సాధారణ ప్రజలు బలైపోతున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య జరుగుతున్నపోరు ఇప్పుడు తారా స్థాయికి చేరింది. నేతల మాటలు కాస్తా హద్దులు మీరి, కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి వచ్చేశాయి. దీంతో సాధారణ ప్రజలు రాజకీయాలను అసహ్యించుకునే స్థితికి వచ్చేశారు. ఏ పార్టీలో చూసినా బూతు పురాణాలే కొనసాగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడమే గాక బూతులు కూడా తిట్టుకుంటూ రాష్ట్రం పరువు బజారున పడేస్తున్నారు. చాటుమాటుగా తిట్టుకోవడం మానేసి.. మీడియా ముందే రెచ్చిపోతున్నారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత ఏకంగా కోర్టు మెట్లెక్కగా.. ఇప్పుడు అసెంబ్లీలోలోనే చంద్రబాబుపై, ఆయన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఆరోపిస్తోంది.

తన కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. తిరిగి సీఎం అయ్యేవరకూ అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదంటూ సవాల్ చేసి వెళ్లిపోయారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఎపిసోడ్ లో కూడా రెండు పార్టీల నేతలు హద్దులు దాటేశారు. సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటూ ఒకరిపైఒకరు కత్తులు దూసుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు చంద్రబాబుకు మద్దతుగా కూడా మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని కూడా కామెంట్ చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై విమర్శలను ముక్త కంఠంతో ఖండించారు.

అయితే ఇప్పుడు ఈ రాజకీయం మరో టర్న్ తీసుకుంది. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని తట్టుకోలేక కొందరు ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నారు. మొన్న ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాజాగా కడప జిల్లాకు చెందిన అనితా దీప్తి అనే మహిళ, తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది. చంద్రబాబును అవమానించడం పట్ల కలత చెందానని.. అందుకే మెప్మాలో కో ఆర్డినేటర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పింది. అయితే ఈ రాజీనామాల పరంపర ఆగేలా కనిపించడం లేదు. ఇదొక మాస్ హిస్టీరియాలా మారితే పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనా టీడీపీ, వైసీపీల రాజకీయ క్రీడ ప్రజలకు ఉపయోగం లేకుండా పక్కదారి పడుతుందన్న విషయం మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: