ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడాన్ని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు స్వాగతించారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని తెలిపారు. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని.. ఇన్నాళ్లు అమరావతిని విమర్శించిన వాళ్లు క్షమాపణ చెప్పాలన్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటే సరిపోదనీ.. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు 700రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. రిలే నిరాహార దీక్షలు, కొవిడ్ సమయంలోనూ వివిధ రూపాల్లో నిరసన తెలిపిన వారు.. ఇటీవలే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే నినాదంతో హైకోర్టు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఉంది.

అయితే మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ప్రజా విజయమని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అంటున్నారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే.. నిలవవని చెప్పారు. ఈ విజయం అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, మహిళలకు దక్కుతుందన్నారు. అమిత్ షా తిరుపతి సమావేశంలో చెప్పిన తర్వాతే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అయితే మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నంత మాత్రాన అమరావతిని ఏకైక రాజధానిగా అంగీకరించినట్టు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రవేశపెట్టిన బిల్లులో టెక్నికల్ ఇష్యూస్ ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గింది. అయితే సీఎం తన గత నిర్ణయంపై నిలబడి ఉంటారని మంత్రి కొడాలి నాని స్పష్టంగా చెప్పారు. దీంతో విశాఖనే ఏకైక రాజధానిగా ప్రకటిస్తారేమోనన్న అనుమానం బలపడుతోంది. చూద్దాం.. రాజధానిగా అమరావతిగా కొనసాగిస్తారో.. లేక విశాఖను కొనసాగిస్తారో. ఈ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఒక వేళ విశాఖను ప్రకటిస్తే మళ్లీ ఆందోళనలు చెలరేగే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: