భారత్ లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కొవిడ్ టీకా తీసుకున్న వారికి బహుమతులు అందించనున్నట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా వంట సామాగ్రి, గృహోపకరణాలు, రేషన్ కిట్లు, నగదు, ట్రావెల్ పాస్ లు గిప్ట్ గా ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్రం.. త్వరలోనే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం.

మరోవైపు మన దేశం నుంచి 50లక్షల టీకా డోసులు ఎగుమతి కానున్నాయి. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని కోవ్యాక్స్ కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్, నేపాల్, తజికిస్థాన్, మొజాంబిక్ దేశాలకు కోవిషీల్డ్ టీకా అందించనున్నారు. సీరం ఇనిస్టిట్యూట్ 24.89కోట్ల కొవిషీల్డ్ టీకా డోసుల స్టాక్ పేరుకుపోయిందని... వేగంగా పంపిణీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో.. స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

అంతేకాదు భారత్, సింగపూర్ మధ్య కమర్షియల్ ప్రయాణీకుల విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు.. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ సింగపూర్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత ప్రయాణీకులు క్వారంటైన్ అవసరం లేకుండా ప్రయాణం చేసే అవకాశం కలుగుతుంది. నవంబర్ 29నుంచి చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాల నుంచి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి.

ఇక కొవిడ్ పుట్టినిల్లు.. చైనాలో వ్యాక్సినేషన్ జోరుగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 107 కోట్లమందికి టీకాలు వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే అక్కడ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి కనిపిస్తోంది. ఈ కారణంగా బూస్టర్ డోసు వేస్తున్నారు. ఇప్పటి వరకు 6.5కోట్ల మందికి బూస్టర్ డోసు వేశారు. ఇక వైరస్ ప్రభావం పెరిగితే.. మళ్లీ లాక్ డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. టీకాలు తీసుకుంటే బహుమతులు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సక్సెస్ అవ్వాలని మనమూ కోరుకుందాం..







మరింత సమాచారం తెలుసుకోండి: