చదువుకున్న మనపిల్లలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిందేనా..? మనకు అలాంటి రాజధాని ఉండదా..? అనే ఆలోచనల నుంచే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న ఆలోచన వచ్చిందని సీఎం జగన్ అన్నారు. విశాఖలో అన్ని వసతులు ఉన్నాయని.. కొద్దిపాటి ఖర్చుతోనే ఐదేళ్లలోనే హైదరాబాద్ నగరంతో పోటీ పడుతుందని చెప్పారు. మరోసారి హైదరాబాద్ లాంటి తప్పు చేయవద్దనే వికేంద్రీకరణ చేశామన్నారు.

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదన్న రాజకీయ నిపుణుల అంచనాలు నిజమయ్యాయి. పరిపాలనా వికేంద్రీకరణపై వెనక్కి తగ్గుతున్నట్టు సీఎం జగన్ తన ప్రసంగంలో ఎక్కడా పేర్కొనలేదు. పైగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వికేంద్రీకరణ ఆవశ్యకతపై చేసిన ప్రసంగాన్ని జగన్ ప్రస్తావించారు. అంతేకాకుండా.. విశాఖను ఎందుకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎంపిక చేశారో జగన్ చెబుతూ తన నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేశారు.

మూడు రాజధానుల బిల్లు విషయంలో ఉన్న న్యాయ చిక్కులు, ప్రజాభిప్రాయ భేదాలు, ఆందోళనలను అర్థం చేసుకొని ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. వీటిని పరిష్కరించి అందరి ఆమోదంతో తిరిగి బిల్లును ప్రవేశపెడతామన్నారు. అయితే జగన్ తన ప్రసంగంలో ఎక్కడా ఏకైక రాజధాని ఉంటుందని ప్రకటించలేదు. పైపెచ్చు విశాఖ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. దీంతో మూడు రాజధానులపై సీఎం వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.

అమరావతిలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనీ.. అది అప్పట్లో వివాదాస్పదం అని అందరికీ తెలుసన్నారు సీఎం జగన్. అమరావతి ప్రాంతం అంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదనీ.. ఇక్కడే తన ఇల్లు ఉందన్నారు. ఈ ప్రాంతం అటు గుంటూరు లేదు.. ఇటు విజయవాడలో లేదని కనీస మౌలిక వసతులు లేవన్నారు. వాటిని అభివృద్ది చేసేందుకు లక్ష కోట్లు కావాలని లెక్కలేశారని పేర్కొన్నారు. ఇక్కడ రాజధాని సాధ్యమేనా..? అని ప్రశ్నించారు. సీఎం జగన్ అభిప్రాయంపై అమరావతి ప్రజలు ఏమంటారో చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: